యువ రైతు ఆత్మహత్య

పంట దిగుబడి, డబ్బులు రాక మనస్తాపం..

పల్నాడు జిల్లా, ఆంధ్రప్రభ: మాచర్ల మండలం కంభంపాడు గ్రామానికి చెందిన యువ రైతు కొరట రాజశేఖర్ (27) ఆర్థిక ఇబ్బందులు, పంటకు సరైన దిగుబడి రాక తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.

పోలీసుల వివరాల ప్రకారం.. ఈ ఏడాది సాగు చేసిన మొక్కజొన్న పంట ఆశించిన స్థాయిలో దిగుబడి ఇవ్వలేదు. అలాగే విక్రయించిన పంటకు సంబంధించిన డబ్బులు ఇప్పటికీ అందకపోవడంతో రాజశేఖర్ తీవ్ర ఆర్థిక ఒత్తిడికి గురయ్యాడు. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలకు (జీజీహెచ్) తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.