తీర ప్రాంతాలకు పచ్చని రక్షణ కవచం..
ఆంధ్రప్రభ, అమరావతి : తీర ప్రాంత పర్యావరణ పరిరక్షణ, సముద్ర కోతల నివారణ లక్ష్యంగా చేపట్టిన గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పనులను వేగవంతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2026–27 సంవత్సరానికి నిర్దేశించిన లక్ష్యాలను వచ్చే రెండు నెలల్లో పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించాలని అటవీ శాఖ అధికారులను ఆదేశించారు.
రాష్ట్రవ్యాప్తంగా 1,053 కిలోమీటర్ల తీర ప్రాంతం వెంబడి ఐదు కిలోమీటర్ల వెడల్పున పచ్చదనంతో కూడిన రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును చేపట్టారు. ఇందులో భాగంగా ఈ ఏడాది 8,888 హెక్టార్లలో గ్రీన్ వాల్ విస్తరణకు ప్రణాళికలు సిద్ధం చేశారు. తీర ప్రాంతాలను వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాల ప్రభావం నుంచి రక్షించేందుకు ఈ ప్రాజెక్టు కీలకంగా మారనుందని అధికారులు పేర్కొన్నారు.
గత రెండేళ్లలో మడ అడవుల విస్తరణలో ఆంధ్రప్రదేశ్ దేశంలో రెండో స్థానాన్ని సాధించింది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో 740 హెక్టార్లు, 2025–26లో 1,930 హెక్టార్ల మేర మడ అడవుల పెంపకం చేపట్టారు. ఈ పురోగతిపై అధికారులను అభినందించిన ప్రభుత్వం.. ఈ ఏడాది మరింత బాధ్యతతో మడ అడవుల విస్తరణ కార్యక్రమాలను కొనసాగించాలని సూచించింది.
మడ అడవుల పెంపకానికి సాధారణంగా అక్టోబర్ నుంచి అనుకూల పరిస్థితులు ఉంటాయని, నవంబర్, డిసెంబర్ నెలల్లో మిష్టి–2 పథకం కింద 305 హెక్టార్లలో మడ అడవుల పునరుద్ధరణ చేపట్టాలని నిర్ణయించారు. తీర ప్రాంతాలకు సహజ రక్షణ కవచంగా నిలిచే మడ అడవుల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు.
గ్రీన్ వాల్‌లో భాగంగా తాటి వనాల ఏర్పాటుపైనా దృష్టి సారించారు. ఈ ఏడాది దాదాపు 5 వేల హెక్టార్లలో తాటి వనాలు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కాలువ గట్లు, చెరువులు, తీర ప్రాంతాల్లో తాటి చెట్లు గాలి నిరోధక వ్యవస్థగా పనిచేస్తాయని, తాటి వనాలు, సామాజిక వనాల ఏర్పాటులో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచాలని సూచించారు.
వీబీ జీ రాం జీ పథకం కింద తీర ప్రాంత జిల్లాలకు అదనంగా మరో 70 లక్షల మొక్కలు అందుబాటులోకి తీసుకురానున్నారు. సుమారు 2,500 హెక్టార్లలో ఈ మొక్కలను నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. తీర ప్రాంత గ్రామాల్లో గ్రామ వనాలు, సామాజిక వనాలు, వ్యవసాయ వనాల అభివృద్ధికి వివిధ శాఖల సమన్వయంతో చర్యలు చేపట్టనున్నారు.
గ్రేట్ గ్రీన్ వాల్‌లో భాగంగా మూడు అంచెల రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. మొదటి అంచెలో తీర ప్రాంతాల్లో మడ అడవులు, షెల్టర్ బెల్ట్ మొక్కల పెంపకం చేపట్టనున్నారు. రెండో, మూడో అంచెల్లో కమ్యూనిటీ బఫర్ జోన్లు, గ్రామ వనాలు, సామాజిక వనాలను అభివృద్ధి చేయనున్నారు. స్థానిక వాతావరణ పరిస్థితులు, వర్షపాతం, భౌగోళిక స్వభావాలను పరిగణనలోకి తీసుకుని పనులు కొనసాగించాలని అధికారులు సూచించారు.
గ్రేట్ గ్రీన్ వాల్ పనుల పురోగతిపై అటవీ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్.. లక్ష్యాల సాధనకు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ పెంచాలని ఆదేశించారు. గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్‌ను ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుగా ముందుకు తీసుకెళ్తున్నామని, పర్యావరణ పరిరక్షణలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.
