ఢిల్లీలో ఘనంగా ‘తెలుగు వెలుగు’ సంబరాలు
కేసీరాజు రాంప్రసాద్
విజయవాడ, ఆంధ్రప్రభ : రాజధాని న్యూఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాలైన హర్యానా, పంజాబ్‌లలో నివసిస్తున్న తెలుగు వారి కోసం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ‘తెలుగు వెలుగు సంబరాలు’ పేరిట ఒక గొప్ప సాంస్కృతిక పండుగను ఈనెల 28వ తేదీన డిల్లీలో ఘనంగా నిర్వహించనున్నట్లు జాతీయ తెలుగు సారస్వత పరిషత్ కార్యనిర్వహక అధ్యక్షుడు కేసీరాజు రాంప్రసాద్ వెల్లడించారు. తెలుగు భాషా వికాసానికి, ప్రవాస తెలుగు వారిని ఏకం చేయడానికి వేదికగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
బందర్ రోడ్డు లోని మురళి ఫార్చ్యూన్ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలుగు వెలుగు సంబరాలు పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం జాతీయ తెలుగు సారస్వత పరిషత్ కార్యనిర్వహక అధ్యక్షుడు కేసీరాజు రాంప్రసాద్, అధ్యక్షులు ముత్యాల శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఈ ప్రతిష్ఠాత్మక సభకు కేంద్ర ఉక్కు, గనుల శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అధ్యక్షత వహించనున్నారని రాంప్రసాద్ తెలిపారు. ఆయనతో పాటు మరో ముగ్గురు కేంద్ర మంత్రులు, సుప్రీంకోర్టు, హైకోర్టులకు చెందిన న్యాయమూర్తులు, ఢిల్లీ సాంస్కృతిక శాఖ మంత్రి ఈ వేడుకలో పాల్గొంటారని వివరించారు.
దేశ గర్వించదగ్గ ‘పరమ్’ సూపర్ కంప్యూటర్‌ను రూపొందించిన శాస్త్రవేత్తలతో పాటు వివిధ రంగాలకు చెందిన ఎంతో మంది లబ్ధప్రతిష్టులైన మేధావులు, ప్రముఖులు ఈ తెలుగు భాషా పండుగకు హాజరవుతున్నట్లు వారు పేర్కొన్నారు.తెలుగు భాష కోసం, సమాజం కోసం వివిధ రంగాలలో విశిష్టమైన సేవలు అందించిన ప్రముఖులకు ఈ సందర్భంగా అత్యున్నత పురస్కారాలను అందజేయనున్నట్లు వారు ప్రకటించారు. ఇందులో భాగంగా తిరుపతికి చెందిన ప్రముఖ ప్రవచనకర్త విభీషణ శర్మ కు రాజకీయ రంగంలో విశేష సేవలు అందించిన పీతానీ సత్యనారాయణ, ఆక్వా రంగంలో విశేష కృషి చేసి ‘ఆక్వా పితామహుడు’గా పేరొందిన ముద్దరాజు కాశీ విశ్వనాథరాజు, ఒరిస్సా క్యాడర్‌కు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సి.జె. వేణుగోపాల్‌లకు ‘జీవిత సాఫల్య పురస్కారాలు’ (లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులు) ప్రదానం చేయనున్నట్లు వెల్లడించారు.
వీరితో పాటు సమాజంలో విశేష ప్రతిభ కనబరిచిన వారికి ‘విశేష ప్రతిభా పురస్కారాలు’ అందజేయనున్నట్లు తెలిపారు. తదనంతరం అవార్డ్స్ కమిటీ చైర్మన్ కంతేటి వెంకటరాజు, సమస్త ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె ఎస్ పి ఎన్ వర్మ మాట్లాడుతూ న్యూఢిల్లీకి చెందిన ఆదినారాయణ, అల్లూరి సీతారామరాజు ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ గౌరవాధ్యక్షులు గొట్టముక్కల గాంధీ భగవాన్ రాజు, సినీ నటుడు చంద్రహాస్, ప్రముఖ రచయిత్రి, కవయిత్రి, గాయని చిత్రలేఖలను ఈ పురస్కారాలతో సత్కరించనున్నట్లు వివరించారు. ఈ తెలుగు సంబరాలను కేవలం ఢిల్లీకే పరిమితం చేయకుండా ఇతర రాష్ట్రాలు, ప్రాంతాలకు కూడా విస్తరిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
రాబోయే ఆగస్టు నెలలో హైదరాబాద్‌లో, సెప్టెంబరులో అండమాన్ నికోబార్ దీవులలో, ఆ తదుపరి ముంబై నగరంలో తెలుగు వారి కోసం ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించ తలపెట్టినట్లు వివరించారు. ఈ మహాత్కార్యక్రమాలకు తెలుగువారందరూ పెద్ద ఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని, తమను ఆశీర్వదించి, అభినందించి ప్రోత్సహించాలని ఈ సందర్భంగా వారు విజ్ఞప్తి చేశారు..
