హెల్మెట్ మరిచి… ప్రాణాలు కోల్పోయి…
హెల్మెట్ మరిచి… ప్రాణాలు కోల్పోయి…
- రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
తొర్రూరు, ఆంధ్రప్రభ : ఒక నిర్లక్ష్యం యువకుడు నిండు ప్రాణాలను బలిగొంది. సురక్షిత గమ్యానికి హెల్మెట్ మార్గమని అధికారులు ఎంతలా అవగాహన కల్పిస్తున్న యువత తలకెక్కించుకోవడం లేదు.
ఈ నేపథ్యంలో ఆదివారం తొర్రూరు పట్టణ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు హెల్మెట్ ధరించకపోవడం వల్ల తలకు బలమైన గాయాలు తగిలి తీవ్ర రక్తస్రావంతో ప్రాణాలు కోల్పోయిన ఘటన స్థానికంగా కలచివేసింది.స్థానికులు తెలిపిన వివరాల మేరకు… మండలంలోని గుర్తురు గ్రామానికి చెందిన జడల నవీన్ (32) నెల్లికుదురు మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా విధులు నిర్వహిస్తున్నాడు.
తొర్రూరు పట్టణంలో కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఆదివారం సెలవు దినం కావడంతో గ్రామంలో ఉన్న తన తల్లి కోసం చేపలు కొనుగోలు చేసి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న క్రమంలో ఎదురుగా వచ్చిన ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టడంతో తలకు, బలమైన గాయాలతో తల్లడిల్లాడు. కాళ్లు నుజ్జు నుజ్జయ్యాయి. గుర్తించిన స్థానికులు క్షతగాత్రున్ని స్థానిక ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ఘటనా స్థలిని సందర్శించిన ఎస్సై మహేందర్ రెడ్డి స్థానికులతో మాట్లాడి వివరాలను నమోదు చేసుకున్నారు. తగిలిన గాయాల ఆధారంగా హెల్మెట్ ధరిస్తే బ్రతికేవాడని వీడియో రూపంలో స్థానికులకు అవగాహన కల్పించాడు. ఏమరుపాటుతో హెల్మెట్ ధరించకపోవడం వల్ల విలువైన ప్రాణాలు యువకుడు కోల్పోయాడు. మృతుడికి భార్యతో పాటు కుమారుడు, కుమార్తెలు ఉన్నారు.ఈ ఘటనపై కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
