భారీ వర్షాలకు కూలిన రెండు ఇండ్లు
తక్షణ సహాయం అందజేత
ఆంధ్రప్రభ బ్యూరో, ఉమ్మడి అదిలాబాద్ : ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వరద బాధితులకు తక్షణ సాయం అందించేందుకు ముందుంటానని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ భరోసా ఇచ్చారు. గురువారం నేరడిగొండ , బోథ్, ఇచ్చోడ మండలాల్లో పర్యటించి భారీ వర్షాల నేపథ్యంలో అప్పుడు మొత్తంగా ఉండాలని సూచించారు. లోతట్టు ప్రాంత ప్రజల స్థితిగతులపై అధికారులతో ఆరా తీశారు.
- భారీ వర్షాలకు కూలిన రెండు ఇండ్లు..
నేరడిగొండ మండల కేంద్రానికి చెందిన మొహమ్మద్, ఈశ్వరి బాయి కి చెందిన రెండు ఇండ్లు కూలిపోవడంతో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అక్కడికి వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా తక్షణ ఆర్థిక సహాయం అందజేశారు. భారీ వర్షాల కారణంగా ఇండ్లు కోల్పోయిన వారి జాబితాను సిద్ధం చేయాలని, నష్టపరిహారం కొరకు నివేదిక అందజేయాలని అధికారులు ఎమ్మార్వో, ఎంపిడివోలను ఆదేశించారు. మండలంలో ఎక్కడ ఎవరికి నష్టం కలిగినా వెంటనే సమాచారం అందించాలని, వారికి అన్ని విధాలా ఆదుకుంటానని హామీ ఇచ్చారు. బాధితులకు ధైర్యం కల్పించారు. వీరి వెంట స్థానిక సర్పంచ్ నీలిమ రవీందర్ రెడ్డి, ఉప సర్పంచ్ గులాబ్, మాజీ ఎంపీపీ రాథోడ్ సజన్, మాజీ జడ్పీటీసీ పండరీ, నాయకులు సాబ్లే సంతోష్, రాథోడ్ సురేందర్, సుజీల్, ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.
