Nara Lokesh | విభేదాలు వీడి.. కలిసికట్టుగా పనిచేయండి..

డోర్ టు డోర్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా చేపట్టండి
ఆదోని టీడీపీ నాయకులతో టిడిపి జాతీయ కార్య నిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ ఆత్మీయ సమావేశం


Nara Lokesh | ఆదోని, జులై 30, ఆంధ్రప్రభ : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆదోని పట్టణ, మండల టిడిపి నేతలు పని చేయాలని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ కోరారు. ఆదోని మండల, పట్టణ టిడిపి ముఖ్యనేతలతో నారా లోకేష్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… చిన్నచిన్న విభేదాలను పక్కనబెట్టి కూటమి నేతలు, కార్యకర్తలను కలుపుకెళ్లాలని అన్నారు.

రెండేళ్ల కూటమి ప్రభుత్వ విజయాలపై డోర్ టు డోర్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించండి. మండల, క్లస్టర్, యూనిట్ ఇంచార్జిలు చురుగ్గా పనిచేయాలి. పనిచేసే వాళ్ళని గౌరవిస్తా. పార్టీ లైన్ దాటి ఎవరైనా మాట్లాడితే సహించేది లేదు. ఏవైనా సమస్యలు ఉంటే ఇంచార్జితో మాట్లాడండి. నాలుగు గోడల నడుమ కలసి కూర్చొని సమస్య పరిష్కరించుకోండి. మీడియాకి ఎక్కితే పార్టీ నష్టపోతుంది. రెవెన్యూ, పోలీసు సమస్యలు, జీ రామ్ జీ బిల్లుల సమస్యలపై అధికారులకు ఆదేశాలు ఇస్తాం. 2014-19 నడుమ హౌసింగ్ బిల్లుల సమస్యపై ముఖ్యమంత్రితో మాట్లాడి, విడతలవారీగా చెల్లించేలా కృషిచేస్తా. కూటమి ధర్మాన్ని పాటిస్తూ కలసికట్టుగా పని చేయాలని లోకేష్ దిశానిర్దేశం చేశారు.

ఈ సమావేశంలో జోనల్ ఇంచార్జి పెళ్లకూరు శ్రీనివాసరెడ్డి, పార్లమెంటు పార్టీ అధ్యక్షురాలు కిస్టమ్మ, నియోజకవర్గ టీడీపీ పరిశీలకుడు కేశవరెడ్డి, ఆదోని పట్టణ పార్టీ అధ్యక్షుడు బి.తిమ్మప్ప, మండల పార్టీ అధ్యక్షుడు కురువ శివప్ప, జిల్లా పార్టీ ట్రెజరర్ వాల్మీకి రవి, ఆదోని టీడీపీ నాయకులు బి. కృష్ణయ్య, లక్ష్మీనారాయణ, బి. విరూపాక్షి, సజ్జాద్ హుసేన్, కొల్లా వీరేష్, రామాంజని, ఎస్.సయ్యదుల్లా, బిపి బస్వరాజ్, కురువ మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.