తెలంగాణ రాష్ర్టంలో రెయిన్ అల‌ర్ట్‌

హైద‌రాబాద్‌, ఆంధ్రప్రభ : ఉత్తర తెలంగాణలో కాసేపు తగ్గిన వర్షాలు మళ్లీ ఉధృతం కానున్నాయి. విదర్భ–ఛత్తీస్‌గఢ్ ప్రాంతాల నుంచి వర్ష మేఘాలు తెలంగాణ వైపు కదులుతుండటంతో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరించారు. హైదరాబాద్‌లో సాయంత్రం నుంచి రాత్రి వరకు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి.

తెలంగాణలో వర్షాలు మరోసారి తీవ్రరూపం దాల్చనున్నాయి. ఉదయం నుంచి ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కురిసిన ఎడతెరిపి వర్షాలకు కాసేపు విరామం లభించినప్పటికీ, విదర్భ–ఛత్తీస్‌గఢ్ ప్రాంతాల నుంచి భారీ వర్ష మేఘాలు తెలంగాణ వైపు కదులుతున్నాయి. దీంతో రానున్న కొన్ని గంటల్లో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరించారు.

ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
రానున్న రెండు గంటల్లో ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా. అలాగే మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడా ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. వికారాబాద్, వనపర్తి, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి.

ఉదయం నుంచి ఈ జిల్లాల్లో ఎడతెరిపి వర్షాలు
ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురిశాయి. ఈ వర్షాల ప్రభావం క్రమంగా హనుమకొండ, వరంగల్, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలకు విస్తరించే అవకాశం ఉందని వాతావరణ విశ్లేషకులు పేర్కొన్నారు. అదేవిధంగా కామారెడ్డి, సిద్ధిపేట, జనగామ, యాదాద్రి భువనగిరి, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో విస్తృతంగా ఓ మోస్తరు వర్షాలు కొనసాగే అవకాశముందని తెలిపారు.

హైదరాబాద్‌లో ఎలా ఉంటుంది?
హైదరాబాద్ నగరంలో మధ్యాహ్నం వరకు చిరుజల్లులు కొనసాగనున్నాయి. సాయంత్రం నుంచి రాత్రి వరకు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ప్రజలకు సూచనలు
భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప వరద ప్రవాహాలు, వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయవద్దని, ప్రయాణికులు వాతావరణ పరిస్థితులను గమనించి ప్రయాణాలు ప్లాన్ చేసుకోవాలని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల ప్రజలు స్థానిక అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.