Stock markets | స్వల్ప లాభాల్లో సెన్సెక్స్‌, నిఫ్టీ…

లాభాల స్వీకరణతో ఒత్తిడి..
బ్యాంకింగ్ షేర్ల అమ్మకాల ప్రభావం


Stock markets | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం ఒడిదుడుకులతో ప్రారంభమయ్యాయి. గరిష్ఠ స్థాయిల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో పాటు బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి పెరగడంతో సూచీలు హెచ్చుతగ్గులను ఎదుర్కొంటున్నాయి. అయితే రూపాయి బలపడటం మార్కెట్‌కు కొంత ఊరటనిచ్చింది.

గత సెషన్ ముగింపు 77,654 పాయింట్లతో పోలిస్తే సెన్సెక్స్ ఫ్లాట్‌గా ప్రారంభమై తొలుత నష్టాల్లోకి జారుకున్నప్పటికీ, అనంతరం తిరిగి కోలుకుంది. ఉదయం 9:40 గంటల సమయానికి సెన్సెక్స్ 31 పాయింట్లు లాభపడి 77,686 వద్ద కొనసాగింది. అదే సమయంలో నిఫ్టీ కూడా స్వల్ప లాభాల్లో ట్రేడవుతోంది. 20 పాయింట్లు పెరిగి 24,270 వద్ద కదలాడుతోంది.

డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 95.75 వద్ద బలపడడం మార్కెట్‌కు అనుకూలంగా మారింది. అయినప్పటికీ బ్యాంకింగ్ రంగంలో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. బ్యాంక్ నిఫ్టీ 307 పాయింట్లు నష్టంలో ఉండగా, నిఫ్టీ మిడ్‌క్యాప్ సూచీ 152 పాయింట్లు తగ్గింది.

సెన్సెక్స్‌, నిఫ్టీలో హీరో మోటోకార్ప్, విప్రో, పెర్సిస్టెంట్, ఆల్కెమ్ ల్యాబ్స్, ఓఎన్‌జీసీ షేర్లు లాభాల్లో ట్రేడవుతుండగా, కేపీఐటీ టెక్నాలజీస్, వారీ ఎనర్జీస్, డాబర్ ఇండియా, ప్రెస్టేజ్ ఎస్టేట్స్, ప్రీమియర్ ఎనర్జీస్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.