మాట తప్పితే… మళ్లీ ఉద్యమిస్తాం
మాట తప్పితే… మళ్లీ ఉద్యమిస్తాం
పేపర్ లీక్ కేసుల ఎత్తివేతపై కేంద్రంపై సీజేపీ విమర్శలు
రాహుల్ వ్యాఖ్యలతో పార్లమెంట్లో వాగ్వాదం, దేశవ్యాప్త ఉద్యమానికి హెచ్చరిక
పేపర్ లీక్పై ఆందోళనకు దిగిన విద్యార్థులపై కేసులు ఎత్తివేత విషయంలో కేంద్రం మాట తప్పుతోందని కాక్రోచ్ జనతాపార్టీ ఆరోపించింది. అలాగే, ఈ అంశంపై పార్లమెంటులో బుధవారం ప్రసంగించిన కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆందోళనకారులపై లాఠీచార్జీకి హోం మంత్రి అమిత్ షా ఆదేశించారంటూ ఆరోపించారు. దీనిపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజూ తీవ్రంగా స్పందించారు. ఆధారాలు చూపాలనీ, లేని పక్షంలో క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఆందోళనకారులపై పెల్లెట్లు ప్రయోగించారని, మేకులున్న లాఠీలతో లాఠీచార్జీ జరిపారని రాహుల్ ఆరోపించారు. పెల్లెట్ల ప్రయోగంపై ఆధారాలను ఇప్పటికే తాను ఇచ్చానని అన్నారు. వీటన్నిటికి బాధ్యత వహిస్తూ అమిత్ షా రాజీనామా చేయాలంటూ ఆయన పట్టుపట్టారు. హోం మంత్రి ఆదేశాలు లేకుండా పోలీసులు లాఠీచార్జీ చేయరని ఆయన అన్నారు. దీనిపై వాగ్వాదం జరిగింది.
తమ పార్టీ కార్యకర్తలపై దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పోలీసులు వేధింపులకు సిద్ధమవుతున్నారని కాక్రోచ్ జనతాపార్టీ అధికార ప్రతినిధి సీజేపీ సౌరవ్ దాస్ ఆరోపించారు. దీనిపై తాము దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన జరపనున్నట్టు ఆయన ప్రకటించారు. కాక్రోచ్ జనతా పార్టీకి ఇచ్చిన హామీలలో ఒక్కదానిని కూడా ప్రభుత్వం నిలబెట్టుకోలేదని ఆయన ఆరోపించారు.
కాగా, విద్యార్థుల ఆందోళనకు కారణమైన పేపర్ లీక్ సంఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోలేదని కూడా ఆయన ఆరోపించారు. నీట్ పేపర్ లీక్పై ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులపై కేసులను మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాలు ఎత్తివేశాయనీ, ఇతర రాష్ట్రాల్లో కూడా కేసులు ఎత్తివేసేట్టు ఆదేశాలు జారీ చేయాలని సౌరవ్ దాస్ డిమాండ్ చేశారు.
మంత్రి రాజీనామాతో సమస్య పరిష్కారమైనట్టుగా ప్రభుత్వం భావిస్తోందనీ, ఇతర అంశాల గురించి పట్టించుకోవడం లేదని సీజేపీ ఆరోపించింది. ఈ విషయాలపై తిరిగి ఉద్యమానికి సమాయత్తమవుతున్నట్టు ఆయన ప్రకటించారు.
నీట్ పేపర్ లీక్పై ఆందోళన జరిపిన విద్యార్థులపై లాఠీచార్జీపై సమగ్రమైన దర్యాప్తు జరపాలనీ, బాధ్యులైన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే డిమాండ్ చేశారు. మంత్రి ధర్మేంద్ర రాజీనామాతో సరిపెడదామని ప్రభుత్వం భావిస్తోందనీ, ఈ విషయంలో కోర్టు ఆదేశాలను, ప్రభుత్వం ఇచ్చిన హామీలను లెక్క చేయడం లేదని సీజేపీ నాయకులు ఆరోపించారు.
విద్యార్థులు ఈసారి ప్రారంభించే ఉద్యమం దేశవ్యాప్తం కానున్నదని వారు హెచ్చరించారు. రాహుల్ ప్రసంగంపై పలువురు బీజేపీ నాయకులు తీవ్రంగా స్పందించారు. హోం మంత్రిపై ఆధారాలు లేని ఆరోపణలు చేసినందుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే బీజేపీ, ఆర్ఎస్ఎస్పై ఆరోపణలు చేసినందుకు కూడా క్షమాపణలు చెప్పాలని కోరారు.
క్షమాపణ ప్రసక్తే లేదనీ, ఆ మాటకొస్తే గాయపడిన వారికి ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని విద్యార్థి నాయకులు డిమాండ్ చేశారు. ఈ ఉద్యమాన్ని చల్లార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందనీ, ప్రభుత్వం ఎంత ప్రయత్నించినా ఉద్యమం మళ్లీ ఉవ్వెత్తున లేస్తుందని సౌరవ్ దాస్ హెచ్చరించారు.
