భారీ వర్షాల నేపథ్యంలో ముందస్తు చర్యలు ముమ్మరం చేయాలి
ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఆదేశం
జగిత్యాల, ఆంధ్రప్రభ : జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఆదేశించారు. గురువారం తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత శాఖల అధికారులతో జూమ్ సమావేశం నిర్వహించి వర్షాల పరిస్థితిపై సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, భారీ వర్షాల దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు. ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ వేగంగా సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ముఖ్యంగా గోదావరి పరీవాహక మండలాల్లో అధికారులు ప్రత్యేక అప్రమత్తతతో వ్యవహరించాలని, గోదావరి నీటిమట్టాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ముంపునకు గురయ్యే గ్రామాలు, కాలనీలను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. అవసరమైతే ప్రజలను ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని తెలిపారు.
తహసీల్దార్లు, ఎంపీడీఓలు తమ పరిధిలోని పునరావాస కేంద్రాలను తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం, ఆహారం, వైద్య సదుపాయాలతో సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. ప్రజలను తరలించాల్సిన పరిస్థితి ఏర్పడితే వారికి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు.
మున్సిపల్ కమిషనర్లు పట్టణ ప్రాంతాల్లో డ్రైనేజీలు, నాలాలు ఎక్కడా మూసుకుపోకుండా వెంటనే శుభ్రపరచాలని, వర్షపు నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టాలని తెలిపారు. రహదారులపై చెట్లు విరిగి పడితే వెంటనే తొలగించి రాకపోకలకు అంతరాయం కలగకుండా చూడాలని, లోతట్టు ప్రాంతాల్లో నీటిముంపు సమస్యలు తలెత్తకుండా పర్యవేక్షించాలని ఆదేశించారు.
విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, దెబ్బతిన్న విద్యుత్ లైన్లను పరిశీలించి ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. పాత భవనాలు, శిథిలావస్థలో ఉన్న ఇళ్లను గుర్తించి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు తాగునీటి బృందాలు, ఎమర్జెన్సీ రెస్పాన్స్ బృందాలు, యంత్ర సామగ్రిని సిద్ధంగా ఉంచాలని, అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో 24 గంటలు పనిచేయాలని కలెక్టర్ పేర్కొన్నారు.
అధికారులు, సిబ్బంది తమ ప్రధాన కార్యాలయాల్లోనే అందుబాటులో ఉండాలని, ముందస్తు అనుమతి లేకుండా ప్రధాన కార్యాలయాలను విడిచి వెళ్లరాదని స్పష్టం చేశారు. వర్షాల కారణంగా ప్రమాదాలు, నీటి ముంపు, ఆస్తి నష్టం లేదా ప్రజల నుంచి ఫిర్యాదులు అందిన వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించాలని, తీసుకున్న చర్యలను జిల్లా కంట్రోల్ రూమ్‌కు వెంటనే తెలియజేయాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి. రాజ గౌడ్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బి.ఎస్. లత, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
