ప్రజల పక్షాన నిలిచేది పీడీఎఫ్ ఎమ్మెల్సీలే..
ప్రజల పక్షాన నిలిచేది పీడీఎఫ్ ఎమ్మెల్సీలే..
గోపి మూర్తి గెలుపుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి: కేఎస్‌ఎస్ ప్రసాద్
మరోసారి అవకాశం ఇస్తే ప్రజా గొంతు వినిపిస్తా: ఎమ్మెల్సీ గోపి మూర్తి
భీమవరం బ్యూరో, ఆంధ్రప్రభ : శాసన మండలిలో ప్రజల సమస్యలను సమర్థంగా వినిపిస్తూ ప్రజల పక్షాన నిలబడేది పీడీఎఫ్ ఎమ్మెల్సీలేనని యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేఎస్‌ఎస్ ప్రసాద్ అన్నారు. రాబోయే ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థి, ప్రస్తుత ఎమ్మెల్సీ బొర్రా గోపి మూర్తి గెలుపుకు ఉపాధ్యాయులు, ప్రజాసంఘాలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
స్థానిక బ్యాంక్ కాలనీలోని శ్రీకృష్ణదేవరాయ కళ్యాణ మండపంలో ఆదివారం యూటీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన గోపి మూర్తి పరిచయ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు పీఎస్ విజయరామరాజు అధ్యక్షతన జరిగిన ఈ సభలో ప్రసాద్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌లో శాసనమండలి పునరుద్ధరణ తర్వాత పీడీఎఫ్ ఎమ్మెల్సీలు ప్రజా సమస్యలపై మండలిలోనూ, ఉద్యమాల ద్వారా ప్రజాక్షేత్రంలోనూ కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు.
2007లో జరిగిన ఎన్నికల్లో పీడీఎఫ్ పోటీ చేసిన ఏడు స్థానాల్లోనూ విజయం సాధించి చరిత్ర సృష్టించిందన్నారు. ప్రస్తుతం శాసనమండలిలో గోపి మూర్తి ఒక్కరే ఉన్నప్పటికీ, లభించిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుని ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేశారని పేర్కొన్నారు. కార్పొరేట్ విద్యాసంస్థల ప్రతినిధులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శ్రీదేవి మాట్లాడుతూ ప్రత్యర్థులు ఎవరైనా గోపి మూర్తి గెలుపే లక్ష్యంగా పని చేయాలన్నారు. యూటీఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జీవీ రామానుజం మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, కర్షక సమస్యల పరిష్కారంలో గోపి మూర్తి నిరంతరం పోరాడారని చెప్పారు.
సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కే రాజా రామ్మోహన్‌రాయ్ మాట్లాడుతూ కష్టజీవుల పక్షాన పీడీఎఫ్ ఎప్పటికప్పుడు పోరాటాలు చేస్తోందన్నారు. జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి తవ్వ సురేష్ మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం పీడీఎఫ్ అభ్యర్థి గోపి మూర్తిని గెలిపించాల్సిన అవసరం ఉందన్నారు.
యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పీఎస్ విజయరామరాజు, పి. క్రాంతికుమార్ మాట్లాడుతూ రాజకీయ విలువలు తగ్గిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో పీడీఎఫ్ నీతి, నిజాయితీ, నిబద్ధతతో పనిచేస్తోందన్నారు. ఎమ్మెల్సీలకు బడ్జెట్ సందర్భంగా అందించిన రూ.లక్ష విలువైన కానుకను గోపి మూర్తి తిరస్కరించడం ఆయన నిజాయితీకి నిదర్శనమని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్సీ బొర్రా గోపి మూర్తి, మరోసారి అవకాశం కల్పిస్తే శాసనమండలిలో ప్రజల గొంతుకగా మరింత సమర్థంగా పనిచేస్తానని తెలిపారు. ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత ఉభయగోదావరి జిల్లాల్లోని 110 మండలాలు, 14 మున్సిపాలిటీలు, మూడు కార్పొరేషన్లలో పర్యటించి పాఠశాలలు, ఉపాధ్యాయుల సమస్యలను గుర్తించి అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు.
ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, రైతులు, సామాన్య ప్రజల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేశానన్నారు. ఎనిమిది గంటల పని విధానం, నాలుగు లేబర్ కోడ్లు, ఉపాధ్యాయులను పీ-4లో చేర్చడం వంటి అంశాలపై శాసనమండలిలో గట్టిగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలిపారు. పోలవరం నిర్వాసితుల పునరావాస ప్యాకేజీ, రైతుల సంక్షేమ అంశాలను కూడా మండలిలో ప్రస్తావించినట్లు చెప్పారు.
తనకు ఎమ్మెల్సీగా వచ్చిన జీతభత్యాల్లో ఒక్క రూపాయి కూడా వ్యక్తిగత అవసరాలకు వినియోగించలేదని, మెచ్యూరిటీ నిధిగా వచ్చిన రూ.7 లక్షలను కూడా ఉద్యమాలకే ఖర్చు చేశానని పేర్కొన్నారు. పూర్తి కాలం ఎమ్మెల్సీగా పనిచేసే అవకాశం కల్పిస్తే ప్రజా ఉద్యమాల్లో చురుకుగా పాల్గొంటూ ప్రజా సమస్యలను మండలిలో మరింత బలంగా వినిపిస్తానని అన్నారు.
ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బి. వాసుదేవరావు, వ్యాసా కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కంశెట్టి సత్యనారాయణ, కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కే. క్రాంతిబాబు, ఏపీ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, యూటీఎఫ్ నాయకులు, ఉపాధ్యాయులు, ప్రజాసంఘాలు, కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
