కలెక్టరేట్ ఎదుట నల్లబ్యాడ్జీలతో గ్రామీణ మిషన్ ఉద్యోగుల నిరసన

పే స్కేల్ అమలు, పెండింగ్ జీతాల విడుదలకు ప్రభుత్వాన్ని డిమాండ్

భూపాలపల్లి, ఆంధ్రప్రభ : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ గ్రామీణ్ మిషన్ ఉద్యోగులు గురువారం కలెక్టరేట్ కార్యాలయం ఎదుట నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు.

పే స్కేల్‌ను ఆగస్టు 15లోపు అమలు చేయాలని, ప్రతి నెల మొదటి తేదీన వేతనాలు చెల్లించాలని, మూడు నెలలుగా పెండింగ్‌లో ఉన్న జీతాలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

అలాగే ఎస్‌ఆర్‌డీఎస్ బోర్డు తీసుకున్న నిర్ణయాలను తక్షణమే అమలు చేయాలని, సెలవు దినాల్లో విధులు నిర్వహించిన ఉద్యోగులకు తగిన ప్రయోజనాలు కల్పించాలని కోరారు. వేతనాల జాప్యానికి శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు క్యాడర్ వ్యవస్థ, పదోన్నతులు, బదిలీలు, కెరీర్ అడ్వాన్స్మెంట్ పాలసీని అమలు చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.

అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ బాలకృష్ణకు అందజేశారు. తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, లేకుంటే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని ఉద్యోగులు హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో జాక్ చైర్మన్ జమీర్ భాష, ఈసీల అధ్యక్షుడు రాజు, టెక్నికల్ అసిస్టెంట్స్ అధ్యక్షుడు దాసి రాజు, అధ్యక్షుడు రాజేందర్, కుమారస్వామి, మధుకర్, రేణుక, శ్రావణ్ కుమార్, ఎం. రాజు తదితరులు పాల్గొన్నారు.