జోరు వానతో అస్తవ్యస్తమైన జనజీవనం

హుస్సేన్‌మియా వాగు ఉధృత ప్రవాహం..

లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధం

పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ : పెద్దపల్లి జిల్లాలో రెండ్రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేని భారీ వర్షాలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. బుధవారం రాత్రి నుంచి గురువారం వరకు కుండపోతగా వర్షం కురవడంతో జిల్లాలోని వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.

హుస్సేన్‌మియా వాగు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల్లోని కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకోగా, పలు గ్రామాలకు రాకపోకలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. అనేక ప్రాంతాల్లో రహదారులపై వర్షపు నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

పెద్దపల్లి మండలం బ్రాహ్మణపల్లి–రాగినేడు, బోజన్నపేట గ్రామాల మధ్య ఉన్న కల్వర్టులపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. కొత్తపల్లి రైల్వే అండర్‌పాస్ వరద నీటితో నిండిపోవడంతో వాహనాల రాకపోకలు కష్టంగా మారాయి.

భారీ వర్షాల ప్రభావంతో జిల్లాలోని చెరువులు, కుంటలు నిండుకుండలా మారాయి. వాగుల్లో నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరగడంతో ప్రమాద ప్రాంతాల వద్ద అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.

పెద్దపల్లి రూరల్ ఎస్‌ఐ మధుకర్, రాగినేడు పంచాయతీ కార్యదర్శి సంతోష్ రెడ్డితో కలిసి బ్రాహ్మణపల్లి–రాగినేడు కల్వర్టు వద్ద వరద ఉద్ధృతిని పరిశీలించారు. అవసరం లేకుండా బయటకు రావద్దని, వాగులు, వంకలు దాటే ప్రయత్నాలు చేయవద్దని ప్రజలకు సూచించారు.

జిల్లాలో అధిక వర్షపాతం నమోదు

జిల్లాలో గురువారం సగటున 81.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాధారణంగా నమోదయ్యే 9.4 మిల్లీమీటర్లతో పోలిస్తే ఇది 769 శాతం అధికం కావడం గమనార్హం.

మండలాల వారీగా రామగుండంలో 103.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదై అత్యధికంగా నిలిచింది. కాల్వ శ్రీరాంపూర్‌లో 101.5, మంథనిలో 101.4, అంతర్గావ్‌లో 94.0, కమాన్‌పూర్‌లో 93.9, పాలకుర్తిలో 90.4, ముత్తారం–మంథనిలో 87.2, పెద్దపల్లిలో 86.3, రామగిరిలో 85.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మిగిలిన మండలాల్లోనూ సాధారణాన్ని మించిన వర్షాలు కురిశాయి.

ఈ నెల 30 నాటికి జిల్లాలో మొత్తం 484.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాధారణ వర్షపాతం 438.6 మిల్లీమీటర్లతో పోలిస్తే ఇది 10 శాతం అధికం. జిల్లాలో ఆరు మండలాల్లో అధిక, ఐదు మండలాల్లో సాధారణ, మూడు మండలాల్లో లోటు వర్షపాతం నమోదైంది.

భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తోంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో అవసరమైన సహాయక చర్యలు చేపడుతూ, ప్రజలు అధికారుల సూచనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేసింది.