నూతన శోభ సంతరించుకున్న చీకటాయపాలెం ప్రాథమిక పాఠశాల

తొర్రూరు టౌన్, ఆంధ్రప్రభ : మండలంలోని చీకటాయపాలెం ప్రాథమిక పాఠశాల సర్పంచ్ చిదిరాల కృష్ణమూర్తి సహకారంతో నూతన శోభ సంతరించుకుందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొలుపుల శ్రీనివాస్ తెలిపారు.

నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైన సందర్భంగా సోమవారం పాఠశాల పునఃప్రారంభ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు కొలుపుల శ్రీనివాస్, ఉపాధ్యాయులు శోభ, రాములు, వెంకటేశ్వర్లు, కృష్ణమూర్తి, రాము తదితరులు పాఠశాలను మామిడి తోరణాలతో అలంకరించి విద్యార్థులకు ఆత్మీయ స్వాగతం పలికారు.

కార్యక్రమంలో సర్పంచ్ చిదిరాల కృష్ణమూర్తి, ఉపసర్పంచ్ శేఖర్, గ్రామ పంచాయతీ సభ్యులు, ఉపాధ్యాయ బృందం పాల్గొని విద్యార్థులను డప్పు వాయిద్యాలు, పుష్పగుచ్ఛాలతో ఘనంగా ఆహ్వానించారు.

అనంతరం సర్పంచ్ చేతుల మీదుగా విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలను పంపిణీ చేశారు. విద్యా సంవత్సరం మొదటి రోజే పుస్తకాలు, నోటు పుస్తకాలు అందడంతో విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా సర్పంచ్ చిదిరాల కృష్ణమూర్తి మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో అర్హత కలిగిన ఉపాధ్యాయులు సేవలందిస్తున్నారని, గ్రామంలోని తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేలా ముందుకు రావాలని కోరారు.

ఉపాధ్యాయులు నాణ్యమైన విద్య అందించి విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు కృషి చేయాలని సూచించారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.