జూబ్లీహిల్స్ సీఐ సస్పెన్షన్

మహిళ వేధింపుల ఆరోపణలపై చర్య
ప్రాథమిక విచారణలో ఆరోపణలకు బలం
జూబ్లీహిల్స్ సీఐ శ్రీనివాసులు రెడ్డి సస్పెండ్
కొత్త సీఐగా ముత్తు యాదవ్ నియామకం

హైద‌రాబాద్‌, ఆంధ్రప్రభ : మహిళా ఫిర్యాదిదారుపై లైంగిక వేధింపులు, బ్లాక్‌మెయిల్, డబ్బుల వసూళ్ల ఆరోపణలు ఎదుర్కొంటున్న జూబ్లీహిల్స్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ యు. శ్రీనివాసులు రెడ్డిని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సస్పెండ్ చేశారు. ప్రాథమిక విచారణలో ఆరోపణలకు ఆధారాలు లభించినట్లు అధికారులు తెలిపారు.

మహిళా ఫిర్యాదిదారుపై లైంగిక వేధింపులు, బ్లాక్‌మెయిల్, డబ్బుల వసూళ్లకు పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో జూబ్లీహిల్స్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ యు. శ్రీనివాసులు రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. ప్రాథమిక అంతర్గత విచారణలో ఆరోపణలకు బలం ఉన్నట్లు తేలడంతో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆయనను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
కుటుంబ సమస్యతో పోలీసులను ఆశ్రయించిన మహిళ

బాధితురాలి ఫిర్యాదు ప్రకారం, కుటుంబ సమస్యల నేపథ్యంలో 2021 డిసెంబర్‌లో ఆమె పోలీసుల సహాయం కోసం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు. ఆ సమయంలో సీఐ శ్రీనివాసులు రెడ్డి సానుభూతి పేరుతో ఆమెకు దగ్గరై, అనంతరం లైంగికంగా వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించారు.

రహస్యంగా వీడియోలు.. బ్లాక్‌మెయిల్ ఆరోపణలు

ఏకాంత సమయంలో తనకు తెలియకుండా వ్యక్తిగత వీడియోలు, ఫొటోలు చిత్రీకరించారని, వాటిని సామాజిక మాధ్యమాల్లో విడుదల చేస్తానంటూ బెదిరించి భారీ మొత్తంలో డబ్బు వసూలు చేశారని బాధితురాలు డీజీపీకి ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా తనపై ఒత్తిడి తెచ్చి బలవంతంగా గర్భస్రావం చేయించారని కూడా ఆరోపించారు.

ప్రాథమిక విచారణ తర్వాత సస్పెన్షన్

ఫిర్యాదు అందిన తర్వాత పోలీసు శాఖ అంతర్గతంగా ప్రాథమిక విచారణ చేపట్టింది. అందులో ఆరోపణలకు ప్రాథమిక ఆధారాలు లభించినట్లు అధికారులు గుర్తించడంతో సీఐ శ్రీనివాసులు రెడ్డిపై సస్పెన్షన్ చర్యలు తీసుకున్నారు. ఘటనపై మరింత లోతైన విచారణ కొనసాగుతోంది.

కొత్త సీఐగా ముత్తు యాదవ్

జూబ్లీహిల్స్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా ఎం. ముత్తు యాదవ్ను నియమిస్తూ పోలీసు శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త అధికారిని వెంటనే బాధ్యతలు స్వీకరించాలని ఆదేశించింది.