లోలెవెల్ వంతెన వద్ద భద్రతా ఏర్పాట్లు
భారీ వర్షాలతో పొంగిపొర్లుతున్న వాగులు..
మారుమూల గ్రామాలకు నిలిచిన రాకపోకలు
జైనూర్, ఆంధ్రప్రభ : కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్, సిర్పూర్ (యు) మండలాల్లో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతూ పలుచోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
జైనూర్ మండల కేంద్రం నుంచి గౌరీ వైపు వెళ్లే రహదారిలో లెండిగూడ సెంటర్ వద్ద వాగుపై ఉన్న లోలెవెల్ వంతెనపై వరద నీరు ప్రవహిస్తోంది. విషయం తెలుసుకున్న జైనూర్ తహసీల్దార్ ఆడ బీర్షావ్, ఆర్‌ఐ మోహన్, పోలీసులు, గ్రామపంచాయతీ సిబ్బంది అక్కడికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.
వంతెనపై వరద ఉద్ధృతి అధికంగా ఉండటంతో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా భద్రతా చర్యలు చేపట్టారు. వాహనాలు వెళ్లకుండా వంతెన వద్ద రహదారికి అడ్డంగా ట్రాక్టర్లను ఏర్పాటు చేశారు. ప్రజలు ఎవరూ అటువైపు వెళ్లవద్దని అధికారులు సూచించారు.
భారీ వర్షాల కారణంగా లొద్దిగూడ, చింతకర్ర, కిషన్ నాయక్ తండాతో పాటు మరికొన్ని గ్రామాలకు రహదారి సౌకర్యం లేకపోవడంతో పాటు వాగులు పొంగిపొర్లుతున్న కారణంగా రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. దీంతో ఆయా గ్రామాల ప్రజలు రెండు రోజులుగా ఇతర ప్రాంతాలతో సంబంధాలు కోల్పోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ప్రజలకు ఎలాంటి నష్టం జరగకుండా అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు చేపడుతున్నారు.
