పోలీసుల అదుపులో ఉదయ్ కృష్ణారెడ్డి

లైంగిక వేధింపుల కేసులో నిందితుడు
వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరు
10 రోజుల గాలింపున‌కు తెర..

హైద‌రాబాద్‌, ఆంధ్రప్రభ : సహచర మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణిని లైంగికంగా వేధించడంతో పాటు బెదిరింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల అనంతరం న్యాయస్థానంలో హాజరుపరచనున్నారు.

సహచర మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణిని లైంగికంగా వేధించడం, అసభ్యకర సందేశాలు పంపడం, ఆమె వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డిని హైదరాబాద్ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 10 రోజుల గాలింపు అనంతరం నగర శివార్లలో ఆయనను గుర్తించి అదుపులోకి తీసుకున్న పోలీసులు, అనంతరం వైద్య పరీక్షల కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత కోర్టులో హాజరుపరచనున్నారు.

జూలై 18న ఫిర్యాదు
ఈ కేసు జూలై 18న అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో నమోదైంది. 30 ఏళ్ల మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు, జూన్ 23 నుంచి ఉదయ్ కృష్ణారెడ్డి తనను నిరంతరం లైంగికంగా వేధించారని, వాట్సాప్ ద్వారా అసభ్యకర సందేశాలు పంపారని, ఇతర ట్రైనీల సమక్షంలో అవమానకర వ్యాఖ్యలు చేశారని బాధితురాలు ఆరోపించారు.

కిడ్నాప్, బెదిరింపులు, ప్రైవేట్ వీడియో ఆరోపణలు
ఫిర్యాదు ప్రకారం, తన మొబైల్ ఫోన్‌ను బలవంతంగా తీసుకుని పాస్‌వర్డ్ చెప్పించారని, గదిలో నిర్బంధించి జుట్టు పట్టుకుని లాగడంతో పాటు గొంతు నులిమే ప్రయత్నం చేశారని, కత్తితో బెదిరించారని బాధితురాలు పేర్కొన్నారు. అంతేకాకుండా తనకు తెలియకుండా వ్యక్తిగత వీడియోను చిత్రీకరించి, దానిని తన భర్తకు పంపి బ్లాక్‌మెయిల్ చేశారని, జూలై 10న మరోసారి తనపై దాడికి పాల్పడ్డారని ఫిర్యాదులో ఆరోపించారు.

తీవ్ర సెక్షన్ల కింద కేసు
బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా అత్తాపూర్ పోలీసులు భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్)లోని మహిళపై దాడి, లైంగిక వేధింపులు, వెంటాడడం, వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడం, అక్రమ నిర్బంధం, గాయపరచడం, బెదిరింపు తదితర సెక్షన్లతో పాటు సమాచార సాంకేతిక (ఐటీ) చట్టంలోని 66ఈ, 67ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ఆత్మహత్యాయత్నం ప్రచారం.. పోలీసుల వివరణ
కేసు నమోదైన తర్వాత ఉదయ్ కృష్ణారెడ్డి తనపై వచ్చిన ఆరోపణలు అసత్యమని, న్యాయవ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందని సామాజిక మాధ్యమాల ద్వారా పేర్కొన్నారు. తర్వాత మోతీనగర్‌లోని బంధువుల ఇంట్లో ఆయన మద్యం సేవించి అపస్మారక స్థితిలో కనిపించడంతో ఆత్మహత్యాయత్నం చేశారనే ప్రచారం జరిగింది. అయితే, ప్రాథమిక విచారణలో అది సానుభూతి పొందేందుకు చేసిన ప్రయత్నంగా తేలిందని పోలీసులు తెలిపారు. చికిత్స అనంతరం జూలై 22న ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ఆయన ఆ తర్వాత కనిపించకుండా పోయారు.

నాలుగు ప్రత్యేక బృందాలతో గాలింపు
విచారణలో భాగంగా పోలీసులు నోటీసులు జారీ చేయడానికి ప్రయత్నించినప్పటికీ, ఉదయ్ కృష్ణారెడ్డి ఇచ్చిన రెండు చిరునామాల్లోనూ ఆయన లభించలేదు. మొబైల్ ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ కావడంతో నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు. చివరకు హైదరాబాద్ శివార్లలో ఆయనను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు వైద్య పరీక్షల అనంతరం ఆయనను సంబంధిత న్యాయస్థానంలో హాజరుపరచనున్నారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.