బస్టాండ్ పునర్నిర్మాణానికి శంకుస్థాపన

రూ.15.22 కోట్ల పనులకు శ్రీకారం..

గుడి చెరువు బండ్ పార్క్ ప్రారంభం..

మోడల్ బస్‌షెల్టర్లు అందుబాటులోకి…

వర్షాలను సద్వినియోగం చేసుకుని రైతులు పంటలు సాగు చేయాలి: మంత్రి తుమ్మల

వేములవాడ: దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి క్షేత్రంలో అభివృద్ధి పనులకు గురువారం కొత్త ఊపు లభించింది. జిల్లా ఇన్‌చార్జి మంత్రి, వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత-జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా పాల్గొని దాదాపు రూ.15.22 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. వేములవాడ ఆర్టీసీ బస్టాండ్ పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడంతో పాటు గుడి చెరువు బండ్ పార్క్‌ను ప్రారంభించారు. రగుడు బైపాస్ జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన మోడల్ బస్‌షెల్టర్లను అందుబాటులోకి తీసుకొచ్చారు.


బస్టాండ్‌కు మహర్దశ


వేములవాడ ఆర్టీసీ బస్టాండ్ పునర్నిర్మాణ పనులకు రూ.1.65 కోట్లతో శంకుస్థాపన చేశారు. కార్యాలయ గదుల ఏర్పాటు, బస్టాండ్ ఆవరణ సుందరీకరణ, పచ్చదనం పెంపు తదితర పనులు చేపట్టనున్నారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించామని తెలిపారు. ఆర్టీసీలో సిబ్బందిని పెంచడంతో పాటు కొత్త రూట్లను ఏర్పాటు చేసి ప్రజా రవాణాను మరింత విస్తరించామని చెప్పారు.
ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ బస్టాండ్‌ను గతంలో ఎత్తివేస్తామని ప్రకటించినప్పుడు తాను, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కలిసి పోరాటం చేశామని తెలిపారు. 1984లో ప్రారంభమైన బస్టాండ్ ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందలేదని, రాజన్న క్షేత్రానికి నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తుండటంతో ప్రతిరోజూ సుమారు 250 బస్సులు 500 ట్రిప్పులు నడుస్తున్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో బస్టాండ్‌ను ఆధునిక సదుపాయాలతో అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు.

వర్షాలను సద్వినియోగం చేసుకోవాలి: తుమ్మల

రైతులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న వర్షాలు ప్రస్తుతం కురుస్తున్నాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. వచ్చిన వర్షాలను సద్వినియోగం చేసుకునేలా రైతులు ముందుకు సాగాలని సూచించారు. ఆగస్టు చివరి వరకు చేతికి వచ్చే పంటలను దృష్టిలో ఉంచుకుని, పరిస్థితులకు అనుగుణంగా పంటల సాగు చేపట్టాలని సూచించారు.
దేశంలోనే అతిపెద్ద రవాణా సంస్థల్లో ఒకటైన ఆర్టీసీని అన్ని విధాలుగా ప్రక్షాళన చేస్తూ నూతన విధానాలతో ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. ఇప్పటికే ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టడంతో పాటు పలు అభివృద్ధి, సంస్కరణ కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు.
సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో వేములవాడ, బాసర వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాల అభివృద్ధి, పునర్నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఉచిత బస్సు సౌకర్యం ద్వారా మహిళలు పెద్ద సంఖ్యలో దేవాలయాలకు వెళ్లి మొక్కులు చెల్లించుకుంటున్నారని చెప్పారు. ప్రముఖ దేవాలయాల వద్ద ఉన్న ఆర్టీసీ బస్టాండ్లను ఆధునికీకరించి భక్తులు, ప్రయాణికులకు మరిన్ని సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.

ఆహ్లాదకరంగా గుడి చెరువు బండ్ పార్క్

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ గుడి చెరువు వద్ద రూ.12 కోట్లతో అభివృద్ధి చేసిన బండ్ పార్క్‌ను మంత్రులు ప్రారంభించారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో వేములవాడ టెంపుల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ నిధులతో చేపట్టిన ఈ పనులు పూర్తి చేశారు. పార్కులో 40 అడుగుల ఎత్తైన మహాశివుడి విగ్రహం, సప్తమాతృకల విగ్రహాలు ఏర్పాటు చేశారు.
నటరాజ విగ్రహ ఫౌంటెన్, సూర్య నమస్కార్ ప్రాంతం, వాకింగ్ ట్రాక్, కోబుల్ స్టోన్ ఫ్లోరింగ్, ల్యాండ్‌స్కేపింగ్, యాంఫి థియేటర్ తదితర సదుపాయాలను ఏర్పాటు చేశారు. గుడి చెరువులో బోటింగ్ సదుపాయం కల్పించేందుకు సన్నాహాలు కొనసాగుతున్నాయి. దీంతో ఆధ్యాత్మికతతో పాటు పర్యాటక ఆకర్షణ కూడా పెరగనుంది.

ఆకట్టుకుంటున్న మోడల్ బస్‌షెల్టర్లు

రగుడు బైపాస్ జంక్షన్ వద్ద కరీంనగర్, కామారెడ్డి రహదారులపై రూ.12.50 లక్షలతో ఏర్పాటు చేసిన మోడల్ బస్‌షెల్టర్లను కూడా ప్రారంభించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం, ఎస్పీ కార్యాలయం పరిసరాలకు రాకపోకలు సాగించే ఉద్యోగులు, ప్రయాణికులు, ప్రజలకు ఇవి ఉపయోగకరంగా ఉండనున్నాయి.


అభివృద్ధి పనులకు అధికారుల సమన్వయం

ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్ ప్రత్యేక చొరవ, నిరంతర పర్యవేక్షణతో అభివృద్ధి పనులు వేగంగా పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. ప్రణాళికాబద్ధంగా చేపట్టిన పనులతో వేములవాడ పట్టణంలో మౌలిక వసతులు మెరుగుపడటంతో పాటు పర్యాటక రంగానికి మరింత ఊతం లభించనుంది.


భారీ పోలీసు బందోబస్తు


మంత్రుల పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం ,సంజయ్ కుమార్, ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్, ఎస్పీ మహేష్‌కుమార్ గీతే, బొమ్మ శ్రీరామ్ , మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, డీఎస్పీలు నాగేంద్రచారి, శ్రీనివాసులు, సీఐలు వీరప్రసాద్, శ్రీనివాస్‌తో పాటు వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.