ట్రాన్స్‌ఫార్మర్‌కు దారి లేకుండా ఆక్రమణలు..

ట్రాన్స్‌ఫార్మర్‌కు దారి లేకుండా ఆక్రమణలు..

ప్రమాదంపై స్థానికుల ఆందోళన

మేడ్చల్, ఆంధ్రప్రభ: సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేడ్చల్ సర్కిల్ పరిధిలోని గుండ్లపోచంపల్లి 299వ డివిజన్‌లో, నారాయణ చెరువు కట్ట సమీపంలో ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ చుట్టూ నెలకొన్న ఆక్రమణలు స్థానికుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల రోడ్డు పక్కన కూరగాయల దుకాణాల కోసం ఏర్పాటు చేసిన తాత్కాలిక షెడ్లను టౌన్ ప్లానింగ్ సిబ్బంది తొలగించినప్పటికీ, అదే ప్రాంతంలో ఉన్న కొన్ని ఇనుప డబ్బాలను మాత్రం ఇప్పటివరకు తొలగించకపోవడంపై స్థానికులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.

రోడ్డుకు ఆనుకుని ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను పూర్తిగా కప్పివేస్తూ ఈ ఇనుప డబ్బాలు ఏర్పాటు చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. వాటిలో ఒక డబ్బాను మాత్రమే కొద్దిగా పక్కకు జరిపారని, మిగిలిన వాటిని అలాగే వదిలేశారని ఆరోపిస్తున్నారు. భవిష్యత్తులో ట్రాన్స్‌ఫార్మర్‌లో సాంకేతిక సమస్య తలెత్తినా లేదా అది కాలిపోయినా, విద్యుత్ సిబ్బంది మరమ్మతుల కోసం అక్కడికి చేరుకునే పరిస్థితి లేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్రాన్స్‌ఫార్మర్ ముందు ఉన్న ఇనుప డబ్బాల కారణంగా అత్యవసర పరిస్థితుల్లో పనులు నిర్వహించడం కష్టంగా మారే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.

అదేవిధంగా, ట్రాన్స్‌ఫార్మర్ సమీపంలో ఉన్న ఇనుప డబ్బాల వల్ల షార్ట్ సర్క్యూట్ వంటి ఘటనలు జరిగితే ప్రమాదం మరింత తీవ్రంగా మారే అవకాశం ఉందని స్థానికులు హెచ్చరిస్తున్నారు. అక్రమ షెడ్లను తొలగించిన అధికారులు, ట్రాన్స్‌ఫార్మర్ ముందు ఉన్న ఈ డబ్బాలను ఎందుకు తొలగించలేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. విద్యుత్ శాఖ, మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు వెంటనే స్పందించి, ట్రాన్స్‌ఫార్మర్ పరిసరాల్లో ఉన్న ఇనుప డబ్బాలను తొలగించి, నిర్వహణ పనులకు అనువుగా దారి కల్పించాలని గుండ్లపోచంపల్లి డివిజన్ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.