యోగా సంపదను భావితరాలకు అందించాలి
యోగా సంపదను భావితరాలకు అందించాలి
యోగాను ప్రతి ఒక్కరూ జీవన విధానంగా మార్చుకోవాలి: జాయింట్ కలెక్టర్ డా. ఎం.జె. అభిషేక్ గౌడ
ఏలూరు/ద్వారకాతిరుమల, ఆంధ్రప్రభ: భారతీయ సంస్కృతిలో అంతర్భాగమైన యోగా సంపదను భావితరాలకు అందించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా జాయింట్ కలెక్టర్ డా. ఎం.జె. అభిషేక్ గౌడ అన్నారు. యోగా ఆసనాలు కేవలం వ్యాయామం మాత్రమే కాకుండా ఒక జీవనశైలి అని, ప్రతి ఒక్కరూ వాటిని తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు.

12వ అంతర్జాతీయ యోగాంధ్ర–2026 దినోత్సవం సందర్భంగా గురువారం ద్వారకాతిరుమల–టూరిజం ఈవెంట్‌లో భాగంగా అనివీటి కొత్త కళ్యాణ మండపంలో నిర్వహించిన యోగాంధ్ర అభ్యాసన కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా 10 మంది మాస్టర్ ట్రైనర్లు, 650 మంది యోగా అభ్యాసకులతో కలిసి యోగా ఆసనాలు అభ్యసించారు.

కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. అనంతరం వేదపండితులు ప్రార్థనా గీతాలు ఆలపించారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ మాట్లాడుతూ, శ్రీ వెంకటేశ్వరస్వామి వారి ఆశీస్సులతో యోగాంధ్ర అభ్యాసన కార్యక్రమం భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా జరిగిందన్నారు. పర్యాటక ప్రాంతాల్లో యోగా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అంతర్జాతీయ గుర్తింపు లభించడంతో పాటు ప్రజల్లో స్ఫూర్తి పెరుగుతుందని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు ఏలూరు జిల్లాలో యోగాంధ్ర కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగుతున్నాయని తెలిపారు. భారతీయ సంస్కృతి వారసత్వమైన యోగాను భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.
యోగా ఒక రోజు చేసే కార్యక్రమం కాదని, అది నిరంతర ప్రక్రియ అని పేర్కొన్నారు. ప్రతిరోజూ ఉదయం కనీసం అరగంట సమయం కేటాయించి యోగా చేయడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చన్నారు. యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు ఒత్తిడిని నియంత్రించుకోవచ్చని, వృత్తి జీవితంలో మెరుగైన ఫలితాలు సాధించవచ్చని చెప్పారు.
జిల్లాలోని పర్యాటక ప్రాంతాల్లో యోగాంధ్ర కార్యక్రమాల నిర్వహణలో భాగంగా గురువారం ద్వారకాతిరుమలలో కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. ఈ నెల 19న పోలవరం మండలం పట్టిసీమలో సామూహిక యోగా కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
ఈ నెల 21న ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ఏలూరు నగరంలో వెయ్యి మందికి పైగా ప్రజలతో భారీ యోగా కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు యోగాంధ్ర కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా పాల్గొని ఆరోగ్యకర జీవనశైలిని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ పి. జగదాంబ, ఆర్టీవో ఎం.వి. రమణ, ఐటిడిఏ పీవో కె. రాములు నాయక్, టూరిజం జిల్లా మేనేజర్ ఎస్. పట్టాభిరామన్న, డీపీవో జి. మల్లిఖార్జునరావు, జిల్లా ఆయుష్ అధికారి బి. భాస్కర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. యు. శోభ, జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి పి.వి. రమేష్ కుమార్, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి సయ్యద్ అబ్దుల్ అజీజ్, జిల్లా స్వర్ణగ్రామ–స్వర్ణవార్డు అధికారి జి. వెంకటనాయుడు, వివిధ శాఖల జిల్లా, మండల అధికారులు, దేవస్థానం సిబ్బంది, వేద పాఠశాల విద్యార్థులు, భక్తులు, యాత్రికులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
