భక్తులకు చలువ పందిర్లు ఏర్పాటు చేయాలి..
భక్తులకు చలువ పందిర్లు ఏర్పాటు చేయాలి..
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలకూడదు..
శ్రీశైలం దేవస్థానంలో వస్తున్న ఫిర్యాదులపై ఆకస్మికంగా తనిఖీ చేసిన దేవాదాయ ఎక్స్ ఆఫీసీయో కార్యదర్శి
నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : ఇటీవల కాలంలో నంద్యాల జిల్లాలోని జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైలం పుణ్యక్షేత్రంలో వెలసిన శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానంలో పలు సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వానికి అనేక ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ ఫిర్యాదుల పరంపర మేరకు దేవదాయశాఖ ఎక్స్ – అఫిషియో కార్యదర్శి డాక్టర్ యం. హరిజవహర్‌లాల్ శనివారం శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా భక్తుల దర్శన ఏర్పాట్ల గురించి అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కార్యదర్శి మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా వేసవిలో తగు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా భక్తులు అధికసంఖ్యలో దర్శనం కోసం వేచివుండకుండా త్వరగా దర్శనమయ్యే విధంగా అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. భక్తులకు దర్శనాలు కల్పించే విషయమై ప్రణాళికబద్ధంగా వ్యవహరించాలన్నారు. ఈ విషయంలో సంబంధిత విభాగాల అధికారులందరు కూడా పరస్పర సమన్వయంతో విధులు నిర్వర్తించాలన్నారు. అవసరమైనచోట్ల చలువపందిర్లను వేయాలన్నారు.

క్యూకాంప్లెక్సులోనూ, క్యూలైన్లలో నిరంతరం మంచినీటిని అందిస్తుండాలన్నారు. ఇందుకోసమై స్వచ్ఛందసేవలను అందిస్తున్న శివసేవకుల సేవలను విస్తృతంగా వినియోగించుకోవాలన్నారు. క్యూలైన్లలోని నిర్దిష్ట ప్రదేశాలలో ఏర్పాటు చేయబడిన వాటరు పాయింట్లకు ఎటువంటి అంతరాయం లేకుండా నిరంతరం నీటిసరఫరా ఉండాలన్నారు. క్యూకాంప్లెక్సులో ఏర్పాటు చేయబడిన ఫ్యాన్లు, ఎయిరుకూలర్లు, వాటరు కూలర్లు సక్రమంగా పనిచేసే విధంగా ఎలక్ట్రికల్ విభాగం సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తుండాలన్నారు. ఎప్పుడైన మరమ్మతులు తలెత్తినప్పుడు ఎటువంటి ఆలస్యం లేకుండా మరమ్మతులు పూర్తి చేయాలన్నారు.

అదేవిధముగా క్యూకాంప్లెక్స్‌లోని అన్ని శౌచాలయాలలో శుభ్రత నిర్వహణ పట్ల ప్రత్యేక శ్రద్ధ కనపరచాలన్నారు. అన్ని శౌచాలయాలలో కూడా నిరంతరం నీటి సరఫరా ఉండే విధముగా చర్యలు చేపట్టలన్నారు. క్షేత్రంలో పారిశుద్ధ్యం నిర్వహణను కూడా పకడ్బందీగా అమలు చేయాలన్నారు. ఎప్పటికప్పుడు చెత్తా చెదారాలను తొలగించేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా వారు శ్రీస్వామిఅమ్మవార్లను దర్శించుకున్నారు. దర్శనానంతరం కార్యదర్శి వారికి స్వామివార్ల ప్రసాదాలు, శేషవస్త్రం, శ్రీస్వామిఅమ్మవార్ల చిత్రపటం అందజేశారు.
