పుట్టపర్తి నారాయణాచార్యుల జన్మదిన వేడుకలు…

పుట్టపర్తి నారాయణాచార్యుల జన్మదిన వేడుకలు…
కర్నూలు, ఆంధ్రప్రభ : సరస్వతీ పుత్రులు పద్మశ్రీ డాక్టర్ పుట్టపర్తి నారాయణాచార్యులు అని జిల్లా రెవెన్యూ అధికారి సి.వెంకట నారాయణమ్మ ఆయన జన్మదిన సందర్భంగా పేర్కొన్నారు. శనివారం ఉదయం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్ లో పుట్టపర్తి నారాయణాచార్యుల జన్మదిన వేడుకలలో జిల్లా రెవెన్యూ అధికారి సి.వెంకట నారాయణమ్మ పాల్గొని నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ…పుట్టపర్తి నారాయణాచార్యులు కవిగా, పండితునిగా, అవధానిగా, విమర్శకునిగా, వ్యాఖ్యాతగా, వక్తగా, అనువాదకునిగా, వాగ్గేయకారునిగా అనేక సాహిత్య ప్రక్రియలలో గొప్ప పాత్ర పోషించారు. తెలుగు సాహితీ జగత్తులో ఒక తారాజువ్వలాంటివారు.
తెలుగు సాహిత్యం గర్వించదగ్గ మహోన్నత సాహితీ శిఖరం పుట్టపర్తి నారాయణాచార్యులు. అందుకే వారు వ్రాసిన రచన ” శివతాండవం ” లో పదాలు శివతాండవంలా ఉంటాయని, భావం శివుని సుందర లాస్యంగా ఉంటుందని ఆ కాలంలో అందరూ కొనియాడారని తెలిపారు. హృషికేశ్ లో నారాయణ ఆచార్యులను స్వామి శివానంద సరస్వతి “సరస్వతీ పుత్ర” అనే బిరుదును ప్రసాదించారు. భారత ప్రభుత్వం వీరిని “పద్మశ్రీ” బిరుదుతో సత్కరించి గౌరవించింది. ఎన్నో విశ్వవిద్యాలయాలు వీరిని గౌరవ డాక్టరేట్ తో సత్కరించాయి అని డిఆర్ఓ తెలియజేశారు.
ఈ సందర్భంగా సీఈవో సెట్ కూర్ వేణుగోపాల్ మాట్లాడుతూ… పుట్టపర్తి నారాయణాచార్యులు 1914 మార్చి 28 వ తేదీ నాడు అనంతపురం వద్ద గల చియ్యేడు అనే గ్రామంలో జన్మించారు అని చిన్న తనంలోనే రామాయణ, భాగవత, భారత ఇతిహాసాలను ఆకళింపు చేసుకున్నారు. సంగీతం, భరత నాట్యం నేర్చుకొని నాటకాలలో స్త్రీ పాత్రలు పోషించారు అని 12 సంవత్సరాల వయస్సు లోనే “పెనుగొండ లక్ష్మి” అనే పద్య కావ్యం రచించారు.15 భాషలను నేర్చుకోవడమే కాకుండా వాటన్నింటిలో పాండిత్యాన్ని పొందారు, బహుభాషా కోవిదుడు, సరస్వతీ పుత్రుడు పుట్టపర్తి నారాయణాచార్యులు. వారు వ్రాసిన “శివ తాండవం” ప్రాఖ్యాతి గాంచింది అని తెలిపారు.
ఈ జిల్లా టూరిజం అధికారి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ… తెలుగులో వీరు వ్రాసిన కొన్ని ముఖ్యమైన గ్రంధాలు, పెనుగొండ లక్ష్మి, మేఘదూతం, షాజీ, గాంధీ ప్రస్థానం, క్రాంతి సందేశం మొదలైనవి అని, సంస్కృతంలో వీరు వ్రాసిన “త్యాగ రాజ స్వామి సుప్రభాతం” చాలా ప్రసిద్ధి చెందింది అని, ఆంగ్లంలో “లీవ్ ఇన్ ది విండ్”, “ది హీరో” వంటివి ప్రఖ్యాతి చెందినవి. పర్షియన్ భాషలో కూడా వీరికి చక్కని ప్రావీణ్యముంది అని కడపలో శ్రీ రామకృష్ణా హైస్కూల్ లో తెలుగు పండిట్ గా పనిచేసి పదవీ విరమణ పొందారు అని తెలియజేశారు. ఈ సమావేశానికి కలెక్టరేట్, సెట్ కూర్ , టూరిజం శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
