జొన్నగిరి గోల్డ్ మైన్స్‌ను సందర్శించిన మంత్రి కొల్లు రవీంద్ర

కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : కర్నూలు జిల్లాలోని జొన్నగిరి గోల్డ్ మైన్స్‌ను రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర శుక్రవారం సందర్శించారు. ఆయనతో పాటు ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు పాల్గొన్నారు. గోల్డ్ మైనింగ్ కార్యకలాపాలు, తవ్వకాల పురోగతి, భద్రతా ప్రమాణాలపై అధికారులు మంత్రికి వివరించారు.
ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ రాష్ట్రంలో ఖనిజ సంపద అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. జొన్నగిరి గోల్డ్ మైన్స్ ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణకు భంగం కలగకుండా మైనింగ్ కార్యకలాపాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు మాట్లాడుతూ జొన్నగిరి గోల్డ్ మైన్స్ ప్రాంత అభివృద్ధికి దోహదపడుతుందని, రహదారులు, తాగునీరు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలు మరింత మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
గోల్డ్ మైన్స్‌లో అమలు చేస్తున్న ఆధునిక సాంకేతిక విధానాలను మంత్రి పరిశీలించారు. అనంతరం అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. స్థానిక సమస్యలు, ఉపాధి అవకాశాలు, భూసేకరణ అంశాలపై కూడా చర్చించినట్లు తెలిసింది.
