డీఎస్సీపై వైసీపీది దుష్ప్రచారం..

డీఎస్సీపై వైసీపీది దుష్ప్రచారం..

నిరుద్యోగులను మోసం చేసింది వారే

అప్పుల ఊబిలో రాష్ట్రాన్ని నెట్టేసి విమర్శలా?.. పెన్షన్లతో కూటమి చిత్తశుద్ధి నిరూపణ

మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు

విజయవాడ రూరల్, ఆంధ్రప్రభ: మెగా డీఎస్సీపై వైసీపీ నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని వెంటనే నిలిపివేయాలని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు.

ఈ సందర్భంగా దేవినేని ఉమా మాట్లాడుతూ, గత ఐదేళ్ల పాలనలో ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించకుండా నిరుద్యోగ యువతను మోసం చేసిన వైసీపీకి ఇప్పుడు మెగా డీఎస్సీపై మాట్లాడే హక్కు లేదన్నారు. ఉద్యోగాల భర్తీని పూర్తిగా పక్కనపెట్టి యువత భవిష్యత్తుతో చెలగాటమాడిన నాయకులు, ప్రస్తుతం పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల మనోధైర్యాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

సూపర్ సిక్స్ హామీలపై విమర్శలు చేసే నైతిక అర్హత కూడా వైసీపీకి లేదని పేర్కొన్నారు. ప్రజారాజధాని అమరావతిలో వేగంగా జరుగుతున్న అభివృద్ధి పనులను చూసే ధైర్యం లేకపోవడంతోనే వైసీపీ నేతలు విమర్శలకు దిగుతున్నారని అన్నారు.

విధ్వంసకర పాలనతో రాష్ట్రాన్ని లక్షల కోట్ల రూపాయల అప్పుల ఊబిలోకి నెట్టివేసి ఆర్థిక వ్యవస్థను సంక్షోభంలోకి నెట్టారని ఆరోపించారు. వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్ పనులు పూర్తికాకముందే జాతికి అంకితం చేశామని చెప్పుకోవడం గత ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమన్నారు.

పోలవరం ప్రాజెక్టు పనులను కూటమి ప్రభుత్వం వేగవంతంగా ముందుకు తీసుకెళ్తోందని, చివరి ఆయకట్టుకు కూడా సాగునీరు అందేలా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని తెలిపారు.

పదవులు కోల్పోయిన వైసీపీ నేతలు కడుపుమంటతో ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు సవాళ్లతో ఉన్నప్పటికీ ప్రతి నెలా ఒకటో తేదీన ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను లబ్ధిదారుల ఇంటి వద్దకే అందించడం కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని అన్నారు.

ప్రజా సంక్షేమం, అభివృద్ధి విషయంలో కూటమి ప్రభుత్వం ఎలాంటి రాజీ పడదని, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ముందుకు సాగుతుందని దేవినేని ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు.