సంప్రదాయాల పరిరక్షణకు కూటమి కట్టుబడి ఉంది

  • ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య
  • నందిగామ గంగమ్మ జాతరలో పాల్గొన్న ప్రభుత్వ విప్ సౌమ్య
  • అమ్మవారికి ఆషాఢ సారె సమర్పించి ప్రత్యేక పూజలు

నందిగామ, ఆంధ్రప్రభ: ప్రజల విశ్వాసాలు, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక విలువలను పరిరక్షించేందుకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, అభివృద్ధి, సంక్షేమంతో పాటు సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ప్రోత్సాహం అందిస్తూ ముందుకు సాగుతున్నాం అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. నందిగామ పట్టణం 17వ వార్డులో ఘనంగా నిర్వహించిన గంగమ్మ జాతరలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మహిళలు, భక్తులు, కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆషాఢ మాస సారెను సమర్పించారు. అనంతరం ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసాలు, సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. పండుగలు, జాతరలు ప్రజల ఐక్యతకు ప్రతీకలని, అలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కూటమి ప్రభుత్వం నిరంతరం ప్రోత్సాహం అందిస్తోందన్నారు.

నందిగామ నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వేగవంతం చేయడంతో పాటు ప్రజల సాంస్కృతిక, ఆధ్యాత్మిక అవసరాలకు కూడా సమాన ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. ప్రజలకు మెరుగైన పాలన అందించి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. జాతర సందర్భంగా మహిళలు, భక్తులు ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యను ఆప్యాయంగా పలకరించి ఆశీర్వాదాలు అందుకున్నారు కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.