మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

డిజిటల్ బాటలో వ్యవసాయ మార్కెట్లు
వ్యవసాయ మార్కెట్లలో పూర్తి డిజిటలీకరణ..
అక్రమాలకు ఇక చెక్: మంత్రి తుమ్మల
206 మార్కెట్ కమిటీల ఆటోమేషన్‌కు ఆదేశాలు..
కొనుగోళ్లు, లావాదేవీలన్నీ డిజిటల్ విధానంలోనే
సౌర విద్యుత్ వ్యవస్థలు, పత్తి కొనుగోళ్ల సన్నద్ధత, కోహెడ పండ్ల మార్కెట్ పనులు వేగవంతం చేయాలి
అధికారులకు మంత్రి సూచనలు

హైదరాబాద్, ఆంధ్రప్రభ: రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖను పూర్తిస్థాయిలో డిజిటలీకరించి పారదర్శకంగా, సమర్థవంతంగా తీర్చిదిద్దాలని వ్యవసాయ, మార్కెటింగ్, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. మార్కెటింగ్ శాఖ పనితీరు, అభివృద్ధి కార్యక్రమాలు, పత్తి కొనుగోళ్ల సన్నద్ధత, మార్కెట్ యార్డుల అభివృద్ధిపై శనివారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు.

మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని 206 మార్కెట్ కమిటీలను పూర్తిస్థాయిలో ఆటోమేషన్ చేయాలని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన ప్రణాళికలు, టెండర్ ప్రక్రియలను ఆగస్టు నెలాఖరులోగా పూర్తి చేసి, సెప్టెంబర్ నుంచి అమలు ప్రారంభించాలని సూచించారు.

ప్రతి మార్కెట్ యార్డులో సీసీ కెమెరాలు, ఎలక్ట్రానిక్ వెయింగ్ స్కేల్స్, గేట్ ఎంట్రీ–ఎగ్జిట్ వ్యవస్థలను ఒకే డిజిటల్ ప్లాట్‌ఫారంపై అనుసంధానం చేయాలని ఆదేశించారు. రవాణా శాఖలో అమలవుతున్న నంబర్ ప్లేట్ స్కానింగ్ విధానాన్ని మార్కెట్ యార్డుల్లోనూ అమలు చేసి, వాహనాల ప్రవేశం, నిష్క్రమణ, తూకం, కొనుగోలు లావాదేవీలన్నీ డిజిటల్ రూపంలో నమోదు అయ్యేలా సాఫ్ట్‌వేర్ అభివృద్ధి చేయాలని సూచించారు. ఇకపై మార్కెటింగ్ శాఖలో జరిగే అన్ని కొనుగోళ్లు పూర్తిగా డిజిటల్ విధానంలోనే నిర్వహించాలని స్పష్టం చేశారు.

పత్తి కొనుగోళ్లలో అక్రమాలకు తావుండొద్దు

రానున్న పత్తి కొనుగోలు సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ముందస్తు సన్నద్ధత అవసరమని మంత్రి పేర్కొన్నారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ), జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలు, సంబంధిత అధికారులతో ఆగస్టు తొలి లేదా రెండో వారంలో సమావేశం నిర్వహించాలని ఆదేశించారు. గతంలో గుర్తించిన లోపాలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని, కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) ప్రయోజనం పూర్తిగా రైతులకే అందేలా చూడాలని సూచించారు. అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సౌర విద్యుత్ వ్యవస్థలు మూడు నెలల్లో పూర్తి

రాష్ట్రంలోని అన్ని మార్కెట్ యార్డులు, గోదాముల్లో సౌర విద్యుత్ వ్యవస్థల ఏర్పాటును అత్యంత ప్రాధాన్యంగా చేపట్టాలని మంత్రి ఆదేశించారు. వచ్చే నెలలోగా ఫీజిబిలిటీ నివేదికలు సేకరించి, సెప్టెంబర్‌లో పనులు ప్రారంభించి నవంబర్ నాటికి అన్ని మార్కెట్ యార్డులు, గోదాముల్లో సౌర విద్యుత్ వ్యవస్థలను ఏర్పాటు చేయాలని సూచించారు.

అభివృద్ధి పనులకు గడువు

మార్కెటింగ్ శాఖలో కొనసాగుతున్న అన్ని ఇంజినీరింగ్ పనులకు స్పష్టమైన గడువులు నిర్ణయించి, ఈ ఆర్థిక సంవత్సరంలోనే పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. అవసరమైతే పనులను ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్ శాఖలకు అప్పగించి వేగవంతం చేయాలని సూచించారు. కోహెడ సమీకృత పండ్ల మార్కెట్ డిజైన్లను వచ్చే వారంలో ఖరారు చేసి, ముఖ్యమంత్రి అనుమతితో వచ్చే నెలలో నిర్మాణ పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

సిబ్బంది కొరతపై చర్యలు

మార్కెటింగ్ శాఖలో ఇంజినీరింగ్, పరిపాలన విభాగాల్లో ఉన్న సిబ్బంది కొరతను గుర్తించి అదనపు పోస్టుల మంజూరుకు ప్రతిపాదనలు పంపాలని మార్కెటింగ్ డైరెక్టర్‌కు మంత్రి ఆదేశించారు. పనుల్లో జాప్యం లేకుండా అవసరమైన సిబ్బందిని నియమించాలని స్పష్టం చేశారు.

ఆయిల్ పామ్ రైతుల సమస్యలపై చర్చ

సచివాలయంలో వరంగల్, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, సూర్యాపేట, నల్గొండ, నిర్మల్, ఖమ్మం జిల్లాలకు చెందిన ఆయిల్ పామ్ రైతు సంఘాల ప్రతినిధులు మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిసి పలు సమస్యలను వివరించారు. నాణ్యమైన మొక్కలు, ఎరువులు సకాలంలో అందుబాటులో ఉంచడం, ప్రతి మండలంలో ఆయిల్ పామ్ గెలల సేకరణ కేంద్రం ఏర్పాటు, బ్యాంకు రుణాలు, యంత్ర పరికరాలపై సబ్సిడీ, కస్టమ్ హైరింగ్ సెంటర్ల ఏర్పాటు వంటి అంశాలపై వినతిపత్రం అందజేశారు.

దీనిపై స్పందించిన మంత్రి, ఆయిల్ పామ్ రైతుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. తెలంగాణ దేశంలోనే ఆయిల్ పామ్ సాగుకు అత్యంత అనుకూల ప్రాంతమని, ఈ పంట ద్వారా రైతులకు అధిక ఆదాయం లభిస్తుందని పేర్కొన్నారు. రైతులు కోరిన వెంటనే నాణ్యమైన మొక్కలు అందేలా కంపెనీలకు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.