మహంకాళి సన్నిధిలో లారా విలియమ్స్

అమ్మ‌వారికి ప్ర‌త్యేక పూజ‌లు
తెలంగాణ సంస్కృతికి ముగ్ధురాలు
బోనాల ఆధ్యాత్మిక, సాంస్కృతిక విశిష్టతను వివరించిన మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్, ఆంధ్ర‌ప్ర‌భ : సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న అమెరికా కాన్సుల్ జనరల్ లారా ఈ. విలియమ్స్‌కు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అమెరికా కాన్సుల్ జనరల్ సంప్రదాయబద్ధంగా అమ్మవారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం ఆలయ విశిష్టతతో పాటు బోనాల పండుగ ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రాధాన్యతను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆమెకు వివరించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగ రాష్ట్ర ప్రజల భక్తి విశ్వాసాలకు, సాంస్కృతిక వైభవానికి అద్దం పడుతుందని తెలిపారు. ప్రతి ఏడాది అత్యంత వైభవంగా నిర్వహించే సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాల ప్రత్యేకతతో పాటు, బోనం సమర్పణ అనంతరం నిర్వహించే సంప్రదాయ రంగం కార్యక్రమం విశిష్టతను కూడా ఆమెకు వివరించినట్లు చెప్పారు.

ఈ సందర్శన తెలంగాణ గొప్ప సంస్కృతి, సంప్రదాయాలను అంతర్జాతీయ వేదికపై పరిచయం చేసే అవకాశంగా నిలుస్తుందని మంత్రి పేర్కొన్నారు. అమెరికా కాన్సుల్ జనరల్ లారా ఈ. విలియమ్స్ బోనాల ఉత్సవాల్లో పాల్గొనడం ద్వారా తెలంగాణ–అమెరికా మధ్య సాంస్కృతిక సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, ఆలయ అధికారులు, ప్రజాప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.