Tdp-Aspirants : క్యూలో త్యాగధనులు Andhra PrabhaSpl Story
Tdp-Aspirants : క్యూలో త్యాగధనులు Andhra PrabhaSpl Story
- ఎమ్మెల్సీ బెర్తు కోసం..
- ఎన్టీఆర్ జిల్లా ఎదురుతెన్నలు
- గవర్నర్ కోటా బెర్త్ పై కర్బీఫ్..
- టీడీపీలో లాబీయింగ్
- అధిష్ఠానం ప్రసాదం..ఎవరికి..
- సీనియర్లలో ఉత్కంఠ
(ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ )
త్వరలో భర్తీ కనున్న ఎమ్మెల్సీ పదవుల భర్తీపై ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీలో ఆశలు చిగురిస్తున్నాయి. గవర్నర్ కోటాలో ఖాళీ కానున్న ఎమ్మెల్సీ స్థానాలపై పార్టీ వర్గాల్లో చర్చ మొదలవడంతో.. తమ సుదీర్ఘ రాజకీయ సేవలకు ఈసారి గుర్తింపు లభిస్తుందని పలువురు సీనియర్ నేతలు ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఖాళీ అవుతున్న గవర్నర్ కోట ఎమ్మెల్సీ స్థానం కోసం ఎవరి వంతు ప్రయత్నాల్లో వారు ఉంటూ పెద్ద ఎత్తున లాబీయింగ్ చేస్తున్నట్లు రాజకీయంగా చర్చ జరుగుతుంది.
Tdp-Aspirants :మండలి పైనే..సీనియర్ల గంపెడాశ
ఎన్టీఆర్ జిల్లా టీడీపీలో కొందరు సీనియర్ నేతలు చాలాకాలంగా పార్టీ కోసం పనిచేస్తున్నారు. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా పార్టీ జెండాను మోసిన నాయకులు తమకు సముచిత గుర్తింపు రావాలని కోరుకుంటున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కేసులు, అరెస్టులు, నిర్బంధాలను ఎదుర్కొన్నామని చెప్పుకునే నాయకులు.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో తమ సేవలకు ప్రతిఫలంగా పదవి దక్కుతుందని ఆశిస్తున్నారు. మరోవైపు, గత అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడిన నేతలు కూడా ఇప్పుడు ఎమ్మెల్సీ అవకాశం కోసం ఎదురుచూస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఎన్నికల సమయంలో పార్టీ నిర్ణయానికి కట్టుబడి పోటీ నుంచి తప్పుకున్నవారికి భవిష్యత్తులో తగిన ప్రాధాన్యం ఇస్తామన్న హామీలను ఆశావహులు గుర్తుచేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
Tdp-Aspirants : ఆశావహులెవరో
ఎన్టీఆర్ జిల్లా టీడీపీ సీనియర్ నేతల్లో మాజీ మంత్రి నెట్టెం రఘురాం, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తదితరుల పేర్లు రాజకీయ వర్గాల్లో చర్చకు వస్తున్నాయి. అయితే వీరిలో ఎవరైనా ఎమ్మెల్సీ పదవికి ఎంపికవుతారని చర్చ మాత్రం జిల్లావ్యాప్తంగా నాయకులు కార్యకర్తలు జరుగుతుంది . పార్టీ అధిష్ఠానం తుది నిర్ణయం తీసుకునే వరకు ఆశావహుల జాబితా మారే అవకాశమూ ఉంది.
Tdp-Aspirants : ఎన్టీఆర్ జిల్లాకు ప్రాధాన్యం ?
రాష్ట్ర రాజధాని అమరావతి ప్రాంతంలో కీలక భౌగోళిక స్థానం కలిగిన ఎన్టీఆర్ జిల్లాకు రాజకీయంగా ప్రాధాన్యం ఉందని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గవర్నర్ కోటాలో అవకాశం లభిస్తే జిల్లాకు ప్రాతినిధ్యం కల్పించాలన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే ఎమ్మెల్సీ పదవుల భర్తీలో సామాజిక, ప్రాంతీయ సమీకరణాలతో పాటు పార్టీకి చేసిన సేవలు, రాజకీయ సమతుల్యత వంటి అంశాలనూ అధిష్ఠానం పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే జిల్లాకు మంత్రి పదవి కూడా లేని నేపథ్యంలో ఎమ్మెల్సీ నైనా కేటాయించి ఆ లోటును కాస్త భర్తీ చేసే అవకాశం ఉందని నాయకులు బలంగా నమ్ముతున్నారు.
Tdp-Aspirants : రెండు స్థానాలు.. జాబితా చాంతాడు…
ఒకవేళ రెండు ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి అవకాశం ఏర్పడితే.. రాష్ట్రవ్యాప్తంగా పలువురు సీనియర్ నేతలు ఆశావహులుగా తెరపైకి వచ్చే అవకాశం ఉంది. అందులో ఎన్టీఆర్ జిల్లాకు ఒక స్థానం దక్కుతుందా? అన్నది ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది. ఒక స్థానం కోసం పలువురు సీనియర్లు పోటీ పడే పరిస్థితి ఉంటే.. ఎవరికి ప్రాధాన్యం ఇవ్వాలన్నది పార్టీ అధిష్ఠానానికి కీలక నిర్ణయంగా మారనుంది. ఎమ్మెల్సీ పదవులపై చర్చ మొదలైన నేపథ్యంలో ఆశావహులు తమ స్థాయిలో ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అధిష్ఠానంతో సాన్నిహిత్యం, పార్టీ కోసం చేసిన సేవలు, సామాజిక సమీకరణాలు.. ఇవన్నీ తమకు అనుకూలంగా మారతాయని నేతలు అంచనా వేస్తున్నారు. అయితే పదవుల విషయంలో చివరి నిమిషం వరకు సమీకరణాలు మారే అవకాశం ఉండటంతో ఎవరికి వారు తమ ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు.
Tdp-Aspirants :మండలి’లో చోటు దక్కేనా?
ఎన్టీఆర్ జిల్లాకు చెందిన సీనియర్ నేతల్లో ఒకరికి ఎమ్మెల్సీ పదవి దక్కితే.. పార్టీ కోసం దీర్ఘకాలంగా పనిచేసిన వారికి గుర్తింపు లభించినట్లవుతుందని టీడీపీ కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇది ప్రస్తుతం పార్టీ వర్గాల్లో మాత్రం ఖచ్చితంగా ఒక స్థానాన్ని ఎన్టీఆర్ జిల్లాకు కేటాయించాలని డిమాండ్ మాత్రం బలంగా వినిపిస్తోంది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నియామకాలపై మాత్రం అధిష్టానం ఇప్పటివరకు ఎవరికీ హామీ ఇవ్వలేదన్నది మాత్రం స్పష్టం అవుతుంది, ఖాళీల వివరాలు స్పష్టమైన తర్వాతే రాజకీయ సమీకరణాలపై పూర్తి చిత్రం వెలుగులోకి రానుంది. అప్పటి వరకు ‘ఎన్టీఆర్ జిల్లా నుంచి ఎవరికి ఎమ్మెల్సీ చాన్స్?’ అన్న ప్రశ్న టీడీపీ శ్రేణుల్లో ఆసక్తిని రేపుతూనే ఉండనుంది.
