సంఘీభావ ర్యాలీ

హైదరాబాద్ సిటీ జయప్రకాష్ నగర్ కాలనీ అసోసియేషన్ సంఘీభావ ర్యాలీ
హైదరాబాద్‌లో కాలనీ సంక్షేమ సంఘాల ఐక్య ప్రదర్శనలు
ప్రజా ఆస్తుల పరిరక్షణలో ఆయన సేవలు కొనసాగించాలని డిమాండ్

హైదరాబాద్, ఆంధ్రప్రభ : హైడ్రా (HYDRAA) కమిషనర్ ఏ.వి. రంగనాథ్‌కు మద్దతుగా హైదరాబాద్‌లో పలు కాలనీల ప్రజలు, సంక్షేమ సంఘాలు సంఘీభావ ర్యాలీలు నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా జయప్రకాశ్ నగర్ కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం సంఘీభావ ర్యాలీ చేపట్టి రంగనాథ్‌కు మద్దతు ప్రకటించారు.

చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూములు, పార్కుల పరిరక్షణలో రంగనాథ్ తీసుకుంటున్న చర్యలు, నగరంలో అక్రమ ఆక్రమణల తొలగింపులో ఆయన చూపుతున్న చొరవ అభినందనీయమని ర్యాలీలో పాల్గొన్నవారు పేర్కొన్నారు. ప్రజా ఆస్తులను పరిరక్షించడంలో హైడ్రా వ్యవస్థ సమర్థంగా పనిచేస్తోందని, ఆ చర్యలు కొనసాగాలని వారు అభిప్రాయపడ్డారు.

ఇదిలా ఉండగా, లోతుకుంట భూ వివాదానికి సంబంధించిన కేసులో న్యాయస్థాన ఉత్తర్వుల నేపథ్యంలో రంగనాథ్‌ను హైడ్రా కమిషనర్ పదవి నుంచి మార్చాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన సేవలను కొనసాగించాలని కోరుతూ నగరంలోని పలు కాలనీల సంక్షేమ సంఘాలు, స్థానికులు మద్దతు తెలుపుతున్నారు.