కేరళలో అరుదైన వివాహం
కవల సోదరులకు కవల అక్కాచెల్లెళ్లతో వివాహం..
కవల ఫాదర్లు, కవల అసిస్టెంట్లు ప్రత్యేక ఆకర్షణ
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : కేరళలోని కొట్టాయం జిల్లా చంగనస్సేరిలో అరుదైన వివాహ వేడుక అందరినీ ఆకట్టుకుంది. కవల సోదరులు కవల అక్కాచెల్లెళ్లను వివాహం చేసుకోవడంతో పాటు, ఈ పెళ్లి వేడుకలో కవల ఫాదర్లు, కవల అసిస్టెంట్లు పాల్గొనడం విశేషంగా నిలిచింది. చంగనస్సేరి మెట్రోపాలిటన్ చర్చిలో జరిగిన ఈ వివాహంలో కవల సోదరులు అఖిల్ థామస్, నిఖిల్ థామస్లు కవల అక్కాచెల్లెళ్లు మ్యాగీ మేరీ, మరియా మేరీలను వివాహం చేసుకున్నారు. ఈ అరుదైన కలయికను చూసేందుకు బంధుమిత్రులు, స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ఈ వివాహ వేడుకకు మరో ప్రత్యేకత కూడా ఉంది. వివాహాన్ని నిర్వహించిన వారు కూడా కవలలే. ఫాదర్ ఆంటో పెజుమ్‌కాట్టిల్, ఫాదర్ అజో పెజుమ్‌కాట్టిల్ అనే కవల దైవసేవకులు పెళ్లి తంతును నిర్వహించారు. అలాగే ఆల్టర్ బాయ్స్‌గా వ్యవహరించిన జెరాన్, జోహన్ అనే కవల సోదరులు కూడా వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఒకే వేదికపై కవల వరులు, కవల వధువులు, కవల ఫాదర్లు, కవల అసిస్టెంట్లు కలిసి పాల్గొనడం అత్యంత అరుదైన ఘటనగా మారింది. ఈ వినూత్న వివాహానికి సంబంధించిన చిత్రాలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.
