24 గంటల సేవలు ఎక్కడ?..

24 గంటల సేవలు ఎక్కడ?..

తాళం వేసిన పీహెచ్‌సీపై ప్రజల ఆగ్రహం

మోపిదేవి – ఆంధ్రప్రభ : గ్రామీణ ప్రాంత ప్రజలకు 24 గంటల వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కొన్నేళ్ల క్రితం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను (పీహెచ్‌సీలు) అప్‌గ్రేడ్ చేసి, అవసరమైన సిబ్బందిని నియమించింది. అయితే మోపిదేవి మండలంలోని రావివారిపాలెం పీహెచ్‌సీలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

స్థానికుల కథనం ప్రకారం, పగటి సమయంలో మాత్రమే సిబ్బంది అందుబాటులో ఉంటుండగా, రాత్రి వేళలు, సెలవు దినాల్లో పీహెచ్‌సీకి తాళం వేసి ఉండటం సాధారణంగా మారిందని పేర్కొంటున్నారు.

ఆదివారం ఉదయం బొబ్బర్లంక గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు కుక్కకాటుకు గురై వ్యాక్సిన్ కోసం ఉదయం 10 గంటల సమయంలో రావివారిపాలెం పీహెచ్‌సీకి వచ్చారు. అయితే ప్రధాన గేటుకు తాళం వేసి ఉండటంతో లోపలికి వెళ్లి చూడగా, బెడ్లపై ఇద్దరు రోగులు మాత్రమే ఉన్నారని, సిబ్బంది ఎవరూ కనిపించలేదని తెలిపారు.

సిబ్బంది గురించి ఆరా తీయగా, “ఇప్పుడే వస్తామని చెప్పి వెళ్లారు” అని అక్కడ ఉన్న రోగులు సమాధానం ఇచ్చినట్లు బాధితులు పేర్కొన్నారు.

విలువైన వైద్య పరికరాలు, ఔషధాలు ఉన్న ఆరోగ్య కేంద్రంలో బాధ్యతగల సిబ్బంది ఎవరూ లేకుండా రోగులను మాత్రమే ఉంచి వెళ్లడం ఆందోళన కలిగించే అంశమని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

24 గంటల సేవలు అందించేందుకు ప్రభుత్వం సిబ్బందిని నియమించి వేతనాలు చెల్లిస్తున్నప్పటికీ, విధి నిర్వహణలో నిర్లక్ష్యం కనిపిస్తోందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై గతంలో కూడా పలుమార్లు ఫిర్యాదులు వచ్చినప్పటికీ ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శిస్తున్నారు.

పీహెచ్‌సీ పరిధిలోని గ్రామాల ప్రజలకు అత్యవసర వైద్య సేవలు అందుబాటులో ఉండేలా అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.


Leave a Reply