కూటమి సంక్షేమమే ప్రజల బలం..

  • ప్రతి ఇంటికీ ప్రభుత్వ ఫలాలు చేరేలా కృషి చేస్తున్నాం
  • టీడీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ
  • పశ్చిమలో 40 రోజుల ఇంటింటి ప్రచారానికి శ్రీకారం
  • 43వ డివిజన్‌లో ప్రజలను కలిసి సమస్యలు తెలుసుకున్న టీడీపీ నేతలు
  • అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికీ వివరిస్తున్న కూటమి

చిట్టినగర్, ఆంధ్రప్రభ: కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధినే లక్ష్యంగా పనిచేస్తోందని,ప్రతి అర్హుడికి ప్రభుత్వ పథకాల ఫలాలు అందేలా కృషి చేస్తాం అని, ప్రజలు చెప్పిన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం అని టీడీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ అన్నారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో చేపట్టిన 40 రోజుల ఇంటింటి ప్రచార కార్యక్రమం ఆదివారం ప్రారంభమైంది. 43వ డివిజన్ అధ్యక్షుడు మోరబోయిన రాంబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో టీడీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జి బుద్ధా వెంకన్న, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గద్దె అనురాధ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పథకాలను వివరిస్తూనే, పెన్షన్లు, మౌలిక సదుపాయాలు తదితర సమస్యలను ప్రజల నుంచి తెలుసుకుంటున్నామని, వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అర్హులకు న్యాయం జరిగేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. పశ్చిమ నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి బుద్ధా వెంకన్న మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే రాజకీయాలను ప్రజలు తిరస్కరించాలని కోరారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వేగంగా అమలు చేస్తోందని అన్నారు. పశ్చిమ నియోజకవర్గంలోని 22 డివిజన్లలో ఈ ప్రచార కార్యక్రమాన్ని 40 రోజుల పాటు నిర్వహిస్తూ ప్రతి ఇంటిని సందర్శించి ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడంతో పాటు ప్రజల సమస్యలను సేకరించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తామని పార్టీ నాయకులు తెలిపారు.