దళిత స్మశానవాటికకు ప్రహరీ గోడ నిర్మించాలి..

  • పి.నైనవరంలో సామాజిక శంఖారావం సర్వే..
  • మహిళలకు షెడ్డు, తాగునీటి సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి..
  • డ్రైనేజీ, కమ్యూనిటీ హాల్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్..

విజయవాడ రూరల్ (వెస్ట్), ఆంధ్రప్రభ : పి.నైనవరం గ్రామంలో దళితుల సమస్యలపై నిర్వహించిన సిపిఎం పార్టీ సామాజిక శంఖారావం సర్వేలో స్మశానవాటిక ఆక్రమణలు, మౌలిక వసతుల కొరత ప్రధానంగా వెలుగుచూశాయి.స్మశానవాటికకు ప్రహరీ గోడ, మహిళలకు ప్రత్యేక షెడ్డు, తాగునీటి సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.పి.నైనవరం గ్రామంలో సామాజిక శంఖారావం ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వేలో దళితవాడ సమస్యలను పరిశీలించారు. గ్రామంలో సుమారు 300 దళిత కుటుంబాలు, 900 మంది జనాభా నివసిస్తుండగా, వారికి కేటాయించిన స్మశానవాటిక ఆక్రమణలకు గురవుతోందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు.

స్మశానవాటికకు ప్రహరీ గోడ నిర్మించి ఆక్రమణలను అరికట్టడంతో పాటు, మహిళలు బట్టలు మార్చుకునేందుకు ప్రత్యేక షెడ్డు, తాగునీటి కోసం బోరు ఏర్పాటు చేయాలని సర్వే బృందం ప్రభుత్వాన్ని కోరింది. దళితవాడలో డ్రైనేజీ కాల్వలు పూడికతో నిండిపోయి దుర్వాసన వెదజల్లుతున్నాయని, వెంటనే శుభ్రపరిచే చర్యలు చేపట్టాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. అలాగే నిరుపయోగంగా ఉన్న కమ్యూనిటీ హాల్‌కు మరమ్మతులు చేసి విద్యుత్ సౌకర్యం కల్పించి, అక్కడ గ్రంథాలయం ఏర్పాటు చేయాలని సూచించారు.

సర్వేలో సిపిఎం పార్టీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కోట కళ్యాణ్, కౌలు రైతుల సంఘం నాయకులు మాతంగి ఆంజనేయులు, సత్తు శ్రీనివాసరావు, ముగడ అజయ్, ముగడ సురేష్, మాతంగి మల్లేశ్వరరావు, బాల మనోహర్, పొనుగుపాటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. దళితుల సమస్యలపై అధికారులు తక్షణమే స్పందించి పరిష్కార చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు.