సీఎం నిర్ణయంతో సీఆర్టీల హర్షం
సీఎం రేవంత్‌రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం
ఉట్నూర్, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్రంలోని గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలు, ఇతర విద్యాసంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు రెసిడెన్షియల్ టీచర్లు (సీఆర్టీలు) ప్రతి నెల ఒకటో తేదీన వేతనాలు అందేలా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీసుకున్న నిర్ణయంపై సీఆర్టీలు హర్షం వ్యక్తం చేశారు.
ఈ నిర్ణయానికి స్వాగతం పలుకుతూ ఆదివారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చిత్రపటానికి సీఆర్టీలు పాలాభిషేకం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు వి. రమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి వంశి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొట్నక్ జలపతిరావు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కాంట్రాక్టు ఉద్యోగులకు కూడా ప్రతి నెల ఒకటో తేదీన వేతనాలు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అభినందనీయమని అన్నారు.
ఈ నిర్ణయం వల్ల కాంట్రాక్టు ఉద్యోగుల ఆర్థిక ఇబ్బందులు కొంతవరకు తగ్గుతాయని, ఉద్యోగుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సీఆర్టీల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్. రామచందర్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సోమేష్‌తో పాటు పలువురు సీఆర్టీలు పాల్గొన్నారు.
