Monsoon Preparedness | వర్షాకాల సన్నద్ధతపై సీఎం సమీక్ష
Monsoon Preparedness | వర్షాకాల సన్నద్ధతపై సీఎం సమీక్ష
విపత్తుల నిర్వహణకు రూ.1000కోట్లు
ఆంధ్రప్రభ, వెబ్డెస్క్ : రాష్ట్రంలో రానున్న వర్షాకాలాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతోంది. నైరుతి రుతుపవనాల రాక, వర్షాల అంచనాల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. వర్షాకాల సన్నద్ధత, విపత్తుల నివారణ చర్యలపై వివిధ శాఖల అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు.
సమావేశంలో వాతావరణ శాఖ అధికారులు ఈ ఏడాది వర్షపాతం, ఎల్నినో ప్రభావం, వాతావరణ మార్పులపై ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి వ్యవసాయ శాఖ అధికారులకు కీలక సూచనలు చేశారు. వర్షాభావ పరిస్థితులు తలెత్తితే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు అవగాహన కల్పించాలని, తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటలు, పంట మార్పిడి, పంటల వైవిధ్యంపై వివరించాలని ఆదేశించారు.
అదేవిధంగా నీటి పారుదల ప్రాజెక్టుల గేట్లు, ఇతర నిర్వహణ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని సూచించారు. ప్రాజెక్టుల మరమ్మతులు, నిర్వహణకు అవసరమైన నిధులను వెంటనే విడుదల చేయాలని ఆర్థిక శాఖను ఆదేశించారు.
గతంలో దెబ్బతిన్న రహదారులు, కూలిపోయిన వంతెనల పునర్నిర్మాణానికి కూడా అవసరమైన నిధులను విడుదల చేయాలని సీఎం స్పష్టం చేశారు. రాబోయే వర్షాకాలంలో ఎలాంటి అత్యవసర పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనేలా యంత్రాంగం సిద్ధంగా ఉండాలని సూచించారు.
విపత్తు నిర్వహణ శాఖ వద్ద ఉన్న రూ.1,000 కోట్ల నిధులను నిబంధనల ప్రకారం అవసరమైన సందర్భాల్లో వినియోగించాలని ఆదేశించారు. ప్రాణనష్టం, ఆస్తి నష్టం, పశు నష్టం జరిగినప్పుడు అధికారులు ఆలస్యం చేయకుండా వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని పిలుపునిచ్చారు.
