సోషల్ మీడియానే అసలైన శక్తి: కేటీఆర్

వాట్సాప్ అంకుల్స్.. ఇన్‌స్టా పిల్లలే గెలిచారు!
జెన్-జీ ఓటే గేమ్‌చేంజర్: కేటీఆర్
మోదీ ఎవరితో పెట్టుకోకూడదో వారితో పెట్టుకున్నారు

హైదరాబాద్, ఆంధ్రప్రభ: సోషల్ మీడియా వల్లే ప్రభుత్వాల్లో జవాబుదారీతనం పెరిగిందని, సంప్రదాయ మీడియా కంటే డిజిటల్ వేదికలే ఇప్పుడు ప్రజల గొంతుకగా మారాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. శ‌నివారం ఆయ‌న హైద‌రాబాద్‌లో ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొని మాట్లాడారు. యువతరం సోషల్ మీడియా ద్వారా కొత్త తరహాలో ఉద్యమాలు చేపడుతోందని, రానున్న ఎన్నికల్లో జెన్-జీ ఓటర్ల ప్రభావం కీలకంగా ఉండబోతోందని పేర్కొన్నారు.

ఓ కార్యక్రమంలో మాట్లాడిన కేటీఆర్, “వాట్సాప్ అంకుల్స్.. ఇన్‌స్టాగ్రామ్ పిల్లల్లో చివరకు ఎవరు గెలిచారో దేశం చూసింది. జెన్-జీ దెబ్బకు ప్రధాని నరేంద్ర మోదీ కూడా అర్ధరాత్రి ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పెట్టాల్సి వచ్చింది” అంటూ వ్యాఖ్యానించారు.

సంప్రదాయ మీడియా ప్రభుత్వాల ప్రభావంలోకి వెళ్లినా, సోషల్ మీడియాను పూర్తిగా నియంత్రించడం సాధ్యం కాలేదని అన్నారు. సోషల్ మీడియా లేకపోయి ఉంటే అనేక ఘటనల్లో బాధితులకు న్యాయం జరిగేది కాదని అభిప్రాయపడ్డారు.

తెలంగాణలో ఓ కేంద్ర మంత్రి కుమారుడిపై మైనర్ బాలికపై అఘాయిత్య ఆరోపణలు వచ్చినప్పుడు ప్రధాన మీడియా వెంటనే స్పందించలేదని, సోషల్ మీడియా ద్వారా విషయం వెలుగులోకి రావడంతోనే చర్యలు ప్రారంభమయ్యాయని కేటీఆర్ ఆరోపించారు. జర్నలిస్టులపై కేసులు నమోదు చేసి అరెస్టులు చేస్తున్నా మీడియా యాజమాన్యాలు ప్రశ్నించలేని పరిస్థితి నెలకొందని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భాషను అదుపులో పెట్టుకోవాలని సూచించిన కేటీఆర్, తాను ఇతర రాష్ట్రాల్లో తెలంగాణ గౌరవాన్ని కాపాడే విధంగానే మాట్లాడానని చెప్పారు.

హేట్ స్పీచ్ చట్టం ప్రభుత్వంతోనే మొదలవ్వాలి

హేట్ స్పీచ్‌పై చట్టం తీసుకురావాలంటే ముందుగా అధికారంలో ఉన్నవారే బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కేటీఆర్ అన్నారు. జంతర్‌మంతర్ వద్ద విద్యార్థుల ఆందోళనలకు సంబంధించిన రీల్స్ తొలగించడం, సోషల్ మీడియా వేదికలపై కేంద్రం ఒత్తిడి తీసుకురావడం వంటి అంశాలను ప్రస్తావించారు. తెలంగాణలో సోషల్ మీడియాలో ఒక పోస్టును రీట్వీట్ చేసినందుకు వ్యక్తిని జైలుకు పంపిన ఘటనలను కూడా ఆయన ఉదాహరణగా పేర్కొన్నారు.

ఫేక్ న్యూస్‌పై విమర్శలు

సోషల్ మీడియా ద్వారా ఫేక్ న్యూస్ ప్రచారం జరుగుతోందన్న వ్యాఖ్యలకు స్పందించిన కేటీఆర్, గతంలో ప్రగతి భవన్‌లో 150 బెడ్‌రూమ్‌లు, బంగారు అల్మారాలు ఉన్నాయంటూ ప్రచారం చేయడం, కాళేశ్వరం ప్రాజెక్టుపై భారీ అవినీతి ఆరోపణలు చేయడం, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై వచ్చిన ప్రచారాన్ని ప్రస్తావిస్తూ అవి కూడా ఫేక్ న్యూస్ కాదా అని ప్రశ్నించారు. సోషల్ మీడియా అయినా, ప్రధాన మీడియా అయినా ఏ సమాచారం వచ్చినా ముందుగా వాస్తవ నిర్ధారణ (ఫ్యాక్ట్ చెక్) జరగాలని కేటీఆర్ సూచించారు. “నిజం గడప దాటేలోపే అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది” అంటూ తప్పుడు ప్రచారాలపై ఆయన వ్యాఖ్యానించారు.