లిఫ్ట్ ప్రమాదాలకు యాజమాన్యానిదే బాధ్యత..
- సిఆర్పిఎఫ్ పల్నాడు జిల్లా అధ్యక్షుడు మురికిపూడి ప్రసాద్
చిలకలూరిపేట, ఆంధ్రప్రభ : దేశవ్యాప్తంగా అపార్ట్‌మెంట్లు, కార్యాలయాలు, ఆసుపత్రులు, షాపింగ్ మాల్స్, ప్రభుత్వ భవనాల్లో ప్రతిరోజూ లక్షలాది మంది వినియోగిస్తున్న లిఫ్టుల భద్రత విషయంలో భారత సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పు చారిత్రాత్మకమని, ప్రతి లిఫ్ట్ వినియోగదారుడు ఈ తీర్పు గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందని వినియోగదారుల హక్కుల పరిరక్షణ వేదిక (సీఆర్పీఎఫ్) పల్నాడు జిల్లా అధ్యక్షులు మురికిపూడి ప్రసాద్ తెలిపారు.
మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, 2026 జూలై 30న సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు ప్రకారం లిఫ్ట్ ప్రమాదం జరిగితే లిఫ్ట్ తయారీ సంస్థ, నిర్వహణ సంస్థ, అలాగే భవన యాజమాన్యం ఉమ్మడిగా బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ప్రమాద బాధితులు అసలు తప్పు ఎవరిదో నిరూపించాల్సిన అవసరం లేకుండా, బాధ్యులైన వారిలో ఎవరి నుంచైనా పూర్తి నష్టపరిహారం కోరే హక్కు కల్పించడం ఈ తీర్పులో అత్యంత ముఖ్యమైన అంశమని వివరించారు.
లిఫ్టుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించడం, ఫిర్యాదులను పట్టించుకోకపోవడం, వార్షిక భద్రతా తనిఖీలు చేయకపోవడం వంటి చర్యలు ఇకపై తీవ్రమైన చట్టపరమైన, ఆర్థిక పరిణామాలకు దారితీస్తాయని హెచ్చరించారు. అపార్ట్‌మెంట్ అసోసియేషన్లు, నివాస సంక్షేమ సంఘాలు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు అధీకృత సంస్థలతో క్రమం తప్పకుండా లిఫ్టులకు నిర్వహణ చేపట్టాలని, లోపాలు కనిపించిన వెంటనే లిఫ్ట్‌ను నిలిపివేసి మరమ్మతులు పూర్తయ్యాకే వినియోగానికి అనుమతించాలని సూచించారు.
లిఫ్ట్ వినియోగదారులు కూడా సామర్థ్యానికి మించి ప్రయాణించకూడదని, లిఫ్ట్‌లో చిక్కుకున్నప్పుడు తలుపులు బలవంతంగా తెరవడానికి ప్రయత్నించకుండా అత్యవసర అలారం లేదా కమ్యూనికేషన్ వ్యవస్థను వినియోగించాలని, అసాధారణ శబ్దాలు లేదా కుదుపులు గమనించిన వెంటనే యాజమాన్యానికి సమాచారం ఇవ్వాలని మురికిపూడి ప్రసాద్ కోరారు.
ఈ సుప్రీంకోర్టు తీర్పు ప్రజల ప్రాణ భద్రతకు మరింత రక్షణ కల్పించేలా ఉందని, రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు భవనాల యాజమాన్యాలు లిఫ్ట్ భద్రతా ప్రమాణాలను కచ్చితంగా అమలు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రజల్లో లిఫ్ట్ భద్రతపై అవగాహన పెంచేందుకు ఈ తీర్పును విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
