ప్రైవేట్‌ ఇంటర్నెట్‌కు గుడ్‌బై..

  • టీ-స్వాన్‌ స్థానంలో టీ-ఫైబర్‌..
  • ప్రభుత్వ కార్యాలయాలకు టీ-ఫైబర్‌ ఇంటర్నెట్ తప్పనిసరి..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలంగాణలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సెప్టెంబర్‌ 1 నుంచి టీ-ఫైబర్‌ ద్వారానే ఇంటర్నెట్‌ సేవలు అందించాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అధికారులను ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో టీ-ఫైబర్‌ సేవల విస్తరణపై నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో ఆయన ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

నిర్దేశించిన గడువులోగా రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ కార్యాలయానికి టీ-ఫైబర్‌ కనెక్టివిటీ కల్పించాలని మంత్రి సూచించారు. సెప్టెంబర్‌ 1 తర్వాత ఏ ప్రభుత్వ శాఖ కూడా ప్రైవేట్‌ ఇంటర్నెట్‌ సేవలను వినియోగిస్తూ బిల్లులు చెల్లించవద్దని ఆదేశించారు.

ప్రభుత్వ నిధుల ఆదా, ఏకీకృత డిజిటల్‌ నెట్‌వర్క్‌ ఏర్పాటే ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశమని మంత్రి తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వ విభాగాలు ఉపయోగిస్తున్న టీ-స్వాన్‌ (T-SWAN) నెట్‌వర్క్‌ను వచ్చే నెల రోజుల్లో పూర్తిగా టీ-ఫైబర్‌ సేవలకు మార్చాలని సంబంధిత అధికారులకు గడువు విధించారు.

అలాగే భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపుదిద్దుకుంటున్న ఫ్యూచర్‌ సిటీకి అత్యాధునిక టీ-ఫైబర్‌ కనెక్టివిటీ కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు.

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ‘ఇంటింటికీ ఇంటర్నెట్‌’ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేసి గ్రామీణ ప్రాంతాల వరకు నాణ్యమైన బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు అందించాలని సూచించారు. నిర్ణీత గడువులోగా లక్ష్యాలను పూర్తి చేసి తెలంగాణను దేశంలోనే అత్యుత్తమ డిజిటల్‌ కనెక్టివిటీ కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి శ్రీధర్‌బాబు అధికారులను ఆదేశించారు.