ఈ-20 పెట్రోల్‌పై కొత్త వివాదం.. ఇంజిన్‌కు శాశ్వత నష్టమా?
ఈ-20 పెట్రోల్‌పై కొత్త వివాదం.. ఇంజిన్‌కు శాశ్వత నష్టమా?
- ఈ-20 పెట్రోల్‌పై సైమా తీవ్ర ఆందోళన
- అధిక క్లోరైడ్, తేమతో ఇంజిన్ భాగాలకు ముప్పు
- వెనక్కి తగ్గేది లేదన్న కేంద్ర ప్రభుత్వం
- వాహనదారుల్లో పెరుగుతున్న అసంతృప్తి
- నాణ్యత పర్యవేక్షణపై కేంద్రం హామీ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఈ-20 పెట్రోల్ నిర్బంధ వినియోగంపై తీవ్ర వ్యతిరేకత పెరుగుతోంది. ఈ విషయంలో వాహనదారులకు వెసులుబాటు కల్పించాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. తాజాగా వాహన తయారీదారుల సంఘం సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (సైమా) కూడా ఈ-20 పెట్రోల్ వినియోగంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఇంధనంలో అధిక క్లోరైడ్ కాలుష్యం, అధిక తేమ కారణంగా వాహన విడిభాగాల వైఫల్యాలు పెరిగాయని తెలిపింది.
బీఐఎస్ ఇంధన స్పెసిఫికేషన్లలో తప్పనిసరిగా క్లోరైడ్ పరిమితులను చేర్చాలని, అలాగే రిటైల్ అవుట్‌లెట్లలో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల ద్వారా పటిష్టమైన నాణ్యత నియంత్రణ అమలు చేయాలని కోరుతూ సైమా పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది. అధిక క్లోరైడ్ స్థాయిల మూలంగా ఇంజిన్ భాగాలకు శాశ్వత నష్టం జరుగుతుందని హెచ్చరించింది.
ఈ లేఖపై ప్రభుత్వం స్పందించింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఇంధన నాణ్యతను క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తాయని పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ తెలిపింది. 87 వేలకుపైగా ఉన్న రిటైల్ అవుట్‌లెట్లలో రోజుకు 8-12 సార్లు నీటి ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
పెట్రోల్లో 20 శాతం ఇథనాల్‌ను కలిపి తయారు చేసిన ఈ-20 పెట్రోలు దేశవ్యాప్తంగా విక్రయించడాన్ని తప్పనిసరి చేసింది. దీనిపై వాహనదారుల్లో తీవ్రమైన అసంతృప్తి నెలకొంది. ఇదే సమయంలో ఇథనాల్ మిశ్రమం మూలంగా ఇంజిన్ పనితీరు దెబ్బతింటుందని, మైలేజీ తగ్గుతుందన్న వార్తలు వచ్చాయి. దీనిపై స్పందించిన పెట్రోలియం మంత్రిత్వ శాఖ మైలేజీ తగ్గే మాట వాస్తవమేనని అంగీకరించింది. ఇంజిన్‌కు ఎలాంటి ప్రమాదం ఉండదని పరిశ్రమ వర్గాలతో వివరణ ఇప్పించింది. దీనిపై దేశవ్యాప్తంగా ఆందోళనలు మాత్రం ఆగడంలేదు.
ఈ-20.. ముందుకే : కేంద్రం ప్రకటన
ఈ-20 పెట్రోల్ విషయంలో వెనక్కి వెళ్లే అవకాశం లేదని కేంద్రం పెట్రోలియం శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి రాజ్యసభలో ఒక ప్రశ్నకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో స్పష్టం చేశారు. ఈ-20 పెట్రోల్ నుంచి ఈ-జీరో, ఈ-10 పెట్రోల్‌కు తిరిగి వెళ్లే ఆలోచన లేదని తెలిపారు.
పెట్రోల్లో ఇథనాల్ బ్లెండింగ్ కార్యక్రమాన్ని నీతి ఆయోగ్, వాహన తయారీదారులు, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు, ఏఆర్ఎఐ, సైమా వంటి సంస్థలతో విస్తృతంగా చర్చించి, శాస్త్రీయంగా ఆమోదించి తీసుకున్న నిర్ణయమని మంత్రి వివరించారు.
ఈ-20 పెట్రోలు ఆప్షనల్‌గా ఇవ్వచ్చన్న ప్రశ్నకు కూడా వివరణ ఇచ్చారు. లక్షకు పైగా ఉన్న రిటైల్ అవుట్‌లెట్లలో ఒకేసారి వేర్వేరు ఇంధనాలను సరఫరా చేయడం వల్ల రవాణా సమస్యలు, నిల్వ, నిర్వహణ ఖర్చులు గణనీయంగా పెరుగుతాయని చెప్పారు.
ఈ-100 కోసం రూపొందించిన వాహనాల్లో ఈ-20 ఇంధనం వినియోగించడం వల్ల మైలేజీ తగ్గే అవకాశం ఉన్నప్పటికీ, ఈ-20 పెట్రోల్ అధిక అక్టేన్ కారణంగా మెరుగైన యాక్సిలరేషన్ లభిస్తుందని పేర్కొన్నారు. ఈ-20 వల్ల కర్బన ఉద్గారాలు 30 శాతం వరకు తగ్గుతాయని వివరించారు. ఈ-20 ఇంధనం వల్ల వాహన ఇంజిన్ పాడైనట్లు ఎటువంటి రుజువూ లేదని కేంద్రం స్పష్టం చేసింది.
సైమా ఆందోళనలు
ఫ్యూయల్ ఇంజెక్టర్లు, ఫ్యూయల్ పంపులు, ఈజీఆర్ వాల్వులు, ఎగ్జాస్ట్ సిస్టమ్‌లు, ఇంధనం లేదా ఇంజిన్ ఉద్గార వాయువులతో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉండే ఇతర భాగాలకు సంబంధించిన సమస్యలు భారీగా పెరిగాయని సైమా సభ్యులు గుర్తించారు.
దెబ్బతిన్న వాహన భాగాలపై జరిపిన పరిశీలనలో ఇంధనంలో అధిక క్లోరైడ్ ఉండటం వల్ల తుప్పు పట్టడం, అరిగిపోవడం జరిగినట్లు గుర్తించారు. వాహనాల ట్యాంక్ నుంచి తీసుకున్న ఇంధన నమూనాల్లో క్లోరైడ్ గాఢత 500 మిల్లీగ్రాముల వరకు ఉన్నట్లు తేలింది. వివిధ ప్రాంతాల్లోని ఇంధన రిటైల్ అవుట్‌లెట్ల నుంచి సేకరించిన నమూనాల్లో క్లోరైడ్ కాలుష్యం ఒక కేజీ ఇంధనంలో 350 మిల్లీగ్రాముల వరకు ఉన్నట్లు తేలింది.
సైమా ప్రకారం ఈ-20 అమలుకు ముందు ఇటువంటి కేసులు చాలా తక్కువగా కనిపించాయని, అమలు తర్వాతే క్లోరైడ్ సంబంధిత సమస్యలు భారీగా పెరిగాయని పేర్కొంది. ఇంధనం లేదా ఎగ్జాస్ట్ సిస్టమ్‌లలో క్లోరైడ్ పేరుకుపోవడం వల్ల కాలుష్య స్థాయిలను బట్టి వెంటనే లేదా కాలక్రమేణా ఇంజిన్ భాగాలకు తుప్పు పట్టడం, శాశ్వత నష్టం కలగవచ్చని ఆందోళన వ్యక్తం చేసింది.
ఆటోమొబైల్ తయారీదారులు రెండేళ్లకుపైగా బీఐఎస్ కమిటీలో క్లోరైడ్ కాలుష్యం సమస్యను లేవనెత్తుతున్నారని సైమా తెలిపింది. క్లోరైడ్‌ను తప్పనిసరి ఇంధన నాణ్యత పరీక్షగా చేర్చాలన్న నిర్ణయం ఇంకా పెండింగ్‌లోనే ఉంది. ఈ కాలుష్యానికి మూలకారణాన్ని గుర్తించి, అవసరమైన నియంత్రణలను ప్రవేశపెట్టాలని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలను కోరుతూ, దీనిపై ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని సైమా కోరింది.
ఈ-20 పెట్రోల్లో అధిక తేమ ఉన్నట్లు కూడా ఆటోమొబైల్ తయారీదారులు గుర్తించారు. అనుమతించిన తేమ స్థాయి కంటే అనేక సందర్భాల్లో అధిక స్థాయిలు నమోదైనట్లు తెలిపింది. అధిక తేమ ఇంధనంలో ఫేజ్ సెపరేషన్‌కు కారణమై, ఇంధనం నింపిన వెంటనే వాహనాన్ని నిలిపివేయగలదని పేర్కొంది.
కేంద్రం స్పందన
వచ్చిన నివేదికలకు పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ స్పందించింది. ఇంధన నాణ్యతను క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తామని పేర్కొంది. క్లోరైడ్, సల్ఫైడ్ కాలుష్యం కోసం 2 వేలకుపైగా నమూనాలను పరీక్షించగా, దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు కేవలం రెండు క్లోరైడ్ కాలుష్య కేసులు మాత్రమే గుర్తించినట్లు తెలిపింది. ఆ రెండు అవుట్‌లెట్ల నుంచి అమ్మకాలను తక్షణమే నిలిపివేసినట్లు వెల్లడించింది.
ఎక్కువ కాలుష్యం కనిపించినా కఠిన చర్యలు తీసుకుంటామని, ఇంధన సరఫరా గొలుసు అంతటా కాలుష్యాన్ని ముందుగానే తనిఖీ చేయాలని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు సూచించినట్లు తెలిపింది. ఈ-20 ఇంధనంపై పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో వాహనాలపై దీని ప్రభావంపై ఏఆర్ఎఐ అధ్యయన నివేదికను బహిర్గతం చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.
