నీళ్లివ్వమంటే అరెస్టులా..?
- స్టేషన్‌లోనే బైఠాయించిన వైసీపీ నేతలు, రైతు ప్రతినిధులు
- శ్రీశైలంలో 860 అడుగుల నీరున్నా ఆయకట్టుకు విడుదలేది?
- స్థానిక ప్రజాప్రతినిధులను నిలదీసిన సుదీర్ దారా
నందికొట్కూర్, ఆంధ్రప్రభ: పగిడ్యాల మండలం ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం నుండి కె.సి. కెనాల్ ఆయకట్టుకు సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రైతులతో కలిసి బుధవారం ఆందోళన చేపట్టిన నందికొట్కూరు వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త డా. ధారా సుదీర్ సహా పలువురు వైసీపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌లో నిర్బంధించారు.
శ్రీశైలం జలాశయంలో 860 అడుగుల మేర నీరు నిల్వ ఉన్నప్పటికీ ముచ్చుమర్రి, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుండి నీటిని విడుదల చేయడం లేదని ఆరోపిస్తూ సుదీర్ రైతులతో కలిసి ముచ్చుమర్రి లిఫ్ట్ పరిశీలనకు బయలుదేరారు. ఈ క్రమంలో పోలీసులు వారిని అడ్డుకోవడంతో తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. లిఫ్ట్ పరిశీలనకు వెళ్తే ఎలా అడ్డుకుంటారు? నీరు విడుదల చేయమని అడిగితే అరెస్టులు చేస్తారా? అంటూ సుదీర్ పోలీసులను నిలదీశారు.
అనంతరం రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపిన దారా సుధీర్‌తో పాటు పలువురు నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీస్ స్టేషన్‌లోనూ నాయకులు తమ నిరసనను కొనసాగించారు. వైసీపీ నేతలు, రైతు ప్రతినిధులు స్టేషన్‌లోనే అధికారులతో వాగ్వాదానికి దిగారు.
ఈ సందర్భంగా డా. దారా సుధీర్ మాట్లాడుతూ, ప్రస్తుతం రైతుల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఒక పక్క వర్షాలు లేక పంటలు ఎండిపోతూ రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి సమయంలో మన పక్కనే ఉన్న కృష్ణానదిలో శ్రీశైలం డ్యామ్ నిండుగా 860 అడుగుల నీరు ఉంది. ఆ నీటిని వాడుకునే అవకాశం, హక్కు మన ఆయకట్టు రైతులకు ఉన్నా ఇక్కడ ఉన్న అధికార పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడం చాలా దారుణమైన విషయం. రైతులపై నిజంగా ప్రేమ చిత్తశుద్ధి ఉంటే ముచ్చుమర్రి లిఫ్ట్ ద్వారా వెంటనే నీటిని విడుదల చేసి ఆయకట్టును కాపాడాలి.
రైతు కన్నీళ్లు తుడిచే బాధ్యత ప్రభుత్వానిదే. లేకపోతే రైతుల పక్షాన మా పోరాటం ఆగదు అని స్పష్టం చేశారు.వెంటనే నీటి విడుదలపై స్పష్టమైన హామీ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈ ఘటనతో ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. రైతుల ఆందోళన నేపథ్యంలో ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆయకట్టు రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం వెంటనే స్పందించి నీటిని విడుదల చేయాలని వైఎస్ఆర్సీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రైతు సంఘం నాయకులు, రైతులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
