బీజేపీలో సయోధ్య సంకేతాలు..!

  • బండి నివాసంలో ఈటల లంచ్ మీట్..
  • తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : తెలంగాణ బీజేపీలో సయోధ్య సంకేతాలు కనిపిస్తున్నాయి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ నివాసంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ ఈటల రాజేందర్‌తో పాటు రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె. లక్ష్మణ్, ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పాల్గొన్న లంచ్ సమావేశం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ భేటీకి సంబంధించిన ఫొటోలను బండి సంజయ్ తన ఎక్స్ ఖాతాలో పంచుకుంటూ.. “మంచి సంభాషణలు ఎప్పుడూ కొత్త ఆలోచనలకు దారితీస్తాయి” అంటూ వ్యాఖ్యానించారు. ఈ పోస్టు తెలంగాణ బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.

విభేదాలకు చెక్ పడిందా..?

ఇటీవలి కాలంలో బండి సంజయ్, ఈటల రాజేందర్ మధ్య విభేదాలపై ప్రచారం జరిగిన నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇద్దరు నేతలు ఒకే వేదికపై ఆత్మీయంగా కలవడం పార్టీ శ్రేణుల్లో సానుకూల సంకేతంగా భావిస్తున్నారు.

అధికారమే లక్ష్యంగా అధిష్ఠానం ఫోకస్…

తెలంగాణలో అధికారాన్ని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ.. రాష్ట్ర నాయకత్వంలో సమన్వయం పెంచడంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. నేతల మధ్య ఉన్న విభేదాలు పార్టీకి నష్టం కలిగిస్తున్నాయనే అభిప్రాయంతో జాతీయ నాయకత్వం సయోధ్యకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే గత నెలలో బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జి అభయ్ పాటిల్ సమక్షంలో ఈటల రాజేందర్, బండి సంజయ్ సమావేశమైన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లో ఎంపీ డాక్టర్ కె. లక్ష్మణ్ నివాసంలో జరిగిన ఆ సమావేశంలో ఇద్దరు నేతలు ఆత్మీయంగా ఆలింగనం చేసుకోవడం అప్పట్లో చర్చనీయాంశమైంది.

ఢిల్లీ భేటీతో కొత్త చర్చ…

హైదరాబాద్ సమావేశం తర్వాత నెల రోజులు గడవకముందే ఢిల్లీలో మరోసారి కీలక నేతలు కలిసి సమావేశం కావడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ బీజేపీలో ఐక్యతను బలోపేతం చేసే దిశగా ఈ సమావేశం కీలకంగా మారుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.