ప్రత్తిపాడులో మెగా జాబ్ మేళా ప్రారంభం
- 45 ప్రముఖ కంపెనీలతో ఉద్యోగ అవకాశాల వేదిక..
- ప్రారంభించిన ఎమ్మెల్యే డా. బూర్ల రామాంజనేయులు
- నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి
ప్రత్తిపాడు, ఆంధ్రప్రభ: నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళా బుధవారం ఘనంగా ప్రారంభమైంది. వట్టిచెరుకూరు మండలం పుల్లడిగుంట గ్రామంలోని ప్రియదర్శిని ఇంజినీరింగ్ కళాశాలలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రత్తిపాడు ఎమ్మెల్యే డాక్టర్ బూర్ల రామాంజనేయులు ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి జాబ్ మేళాను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ కంపెనీల స్టాళ్లను ఎమ్మెల్యే పరిశీలించి, నియామక ప్రక్రియపై సంస్థల ప్రతినిధులతో మాట్లాడారు. ఉద్యోగాల కోసం వచ్చిన యువతతో ముచ్చటించి, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రతి ఇంట్లో కనీసం ఒకరికి ఉద్యోగం కల్పించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పనిచేస్తోందని తెలిపారు. యువతలో నైపుణ్యాలను పెంపొందించి, వారికి ప్రైవేట్ రంగంలో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా జాబ్ మేళాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఇప్పటికే రెండు మెగా జాబ్ మేళాలు విజయవంతంగా నిర్వహించగా, ఇది మూడో జాబ్ మేళా అని ఎమ్మెల్యే వెల్లడించారు. నిరుద్యోగ యువతకు మరిన్ని అవకాశాలు అందించాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు.
ఈ జాబ్ మేళాలో 45 ప్రముఖ కంపెనీలు పాల్గొని వివిధ విభాగాల్లో ఉద్యోగ అవకాశాలను కల్పించాయని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు యువతలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతో పాటు వారి ఆర్థిక స్వావలంబనకు దోహదపడతాయని అన్నారు.
మెగా జాబ్ మేళా నిర్వహణకు సహకరించిన ప్రియదర్శిని ఇంజినీరింగ్ కళాశాల యాజమాన్యాన్ని ఎమ్మెల్యే అభినందించారు. ప్రభుత్వం, పరిశ్రమలు, విద్యాసంస్థలు సమన్వయంతో పనిచేస్తే యువతకు మరింత మెరుగైన ఉపాధి అవకాశాలు అందుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.
నిరుద్యోగ యువత తమ విద్యార్హతలు, నైపుణ్యాలకు తగిన ఉద్యోగాలను ఎంపిక చేసుకుని జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి ఉపాధి కల్పన కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, వివిధ శాఖల అధికారులు, కంపెనీల ప్రతినిధులు, కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, పెద్ద సంఖ్యలో యువతీ యువకులు పాల్గొన్నారు.
