పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంలో అలసత్వం వద్దు
నాణ్యమైన పరిష్కారమే అధికారుల లక్ష్యం కావాలి: కలెక్టర్ కృతిక శుక్లా
పల్నాడు ప్రతినిధి, ఆంధ్రప్రభ : కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. కార్యక్రమంలో డీఆర్ఓ, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లాలోని పలు మండలాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి మొత్తం 119 ఫిర్యాదులను స్వీకరించారు. సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్న కలెక్టర్, వెంటనే పరిష్కార చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
కలెక్టర్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్ అర్జీలను సత్వరంగా, అత్యంత నాణ్యతతో పరిష్కరించాలని సూచించారు. అర్జీల పరిష్కారంలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించరాదని, ప్రతి శాఖ గడువులోపు ఫిర్యాదులను పరిష్కరించాలని ఆదేశించారు. ప్రతిరోజూ అర్జీలను పర్యవేక్షిస్తూ, గడువు ముగియకముందే నాణ్యమైన పరిష్కారం అందించాలని పేర్కొన్నారు. పెండింగ్లో ఉన్న అర్జీలను వేగంగా పరిష్కరించాలని, ప్రజా సమస్యల పరిష్కార వేదిక, రెవెన్యూ క్లినిక్కు వచ్చిన ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
జిల్లాలో 11.43 లక్షల ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ
ఎస్ఐఆర్ ప్రక్రియ పారదర్శకంగా కొనసాగుతోంది: కలెక్టర్
జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ వేగంగా, పారదర్శకంగా కొనసాగుతోందని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా తెలిపారు.
జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇప్పటివరకు 11,43,755 ఎన్యుమరేషన్ ఫారాలను ఓటర్లకు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. క్షేత్రస్థాయిలో సేకరించిన ఫారాల ఆన్లైన్ నమోదు ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతోందని, ఇప్పటివరకు 71,614 ఫారాల డిజిటలైజేషన్ పూర్తయ్యిందని పేర్కొన్నారు.
జిల్లా వ్యాప్తంగా మొత్తం 17,41,798 మంది ఓటర్లు ఉన్నారని, వారి వివరాల సేకరణ, సవరణ కోసం బీఎల్ఓల ద్వారా విస్తృత సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఎస్ఐఆర్ ప్రక్రియకు రాజకీయ పార్టీలు సహకరించాలి
బూత్ లెవల్ ఏజెంట్ల నియామకంపై కలెక్టర్ సూచన
జిల్లాలో చేపడుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమానికి అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా కోరారు.
సోమవారం కలెక్టరేట్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎస్ఐఆర్ ప్రక్రియ కోసం రాజకీయ పార్టీలు బూత్ లెవల్ ఏజెంట్లను నియమించుకోవాలని సూచించారు.
జిల్లాలో పోలింగ్ స్టేషన్ల హేతుబద్ధీకరణ ప్రక్రియలో భాగంగా గతంలో ఉన్న 1,932 పోలింగ్ స్టేషన్లకు అదనంగా 186 కొత్త పోలింగ్ స్టేషన్లను ప్రతిపాదించామని తెలిపారు. ఒక పోలింగ్ స్టేషన్ను విలీనం చేయడం, 16 స్టేషన్ల చిరునామాలు మార్చడం, 50 స్టేషన్ల పేర్లలో మార్పులు చేయడం జరిగిందన్నారు. దీంతో జిల్లాలో మొత్తం పోలింగ్ స్టేషన్ల సంఖ్య 2,117కు చేరిందని వెల్లడించారు.
సమావేశంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు పోలింగ్ బూత్ల మార్పులు, బీఎల్ఓల పనితీరుకు సంబంధించిన అంశాలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.
రైతన్న వారోత్సవాలను విజయవంతం చేయాలి
ప్రకృతి వ్యవసాయంపై రైతులు దృష్టి సారించాలి: కలెక్టర్
జిల్లాలో రైతన్న వారోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా పిలుపునిచ్చారు.
సోమవారం కలెక్టరేట్లో వ్యవసాయ శాఖ రూపొందించిన రైతన్న వారోత్సవాల కరపత్రాలను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వ్యవసాయాభివృద్ధి, సుస్థిర సాగుపై రైతులు దృష్టి సారించాలని సూచించారు.
ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తక్కువగా ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు. రైతులకు నష్టం జరగకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తోందన్నారు. రైతులు లాభసాటి వ్యవసాయ పద్ధతులను అనుసరించాలని, గ్రామాల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు సూచించారు.
