వైభవంగా శాకాంబరీ ఉత్సవాలు

  • కూరగాయలు, పండ్లతో అమ్మవారికి విశేష అలంకరణ..
  • భక్తులతో కిక్కిరిసిన ఆలయం

చిట్టినగర్, ఆంధ్రప్రభ: విజయవాడ మిల్క్ ప్రాజెక్ట్ ఏరియా భీమనవారిపేటలోని శ్రీ విజయదుర్గా రామలింగేశ్వర–పంచముఖ ఆంజనేయస్వామి దేవస్థానంలో బుధవారం శాకాంబరీ ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ విజయదుర్గాదేవి శాకాంబరీ దేవి అలంకారంలో భక్తులకు దివ్య దర్శనమిచ్చి విశేషంగా ఆకట్టుకున్నారు.

అమ్మవారు శాకాంబరీ దేవిగా దర్శనమిచ్చిన సందర్భంగా కోటా నాగేశ్వరరావు రోడ్డులోని శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ మహిళా భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో సారె సమర్పించారు. భక్తులు సమర్పించిన వివిధ రకాల కూరగాయలు, పండ్లతో అమ్మవారిని సుందరంగా అలంకరించారు.

దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఉత్సవాల్లో నిర్వాహకులు గాజుల లక్ష్మణరావు, విజయలక్ష్మి, అశోక్, దీపారాణి, జ్యోతి తదితరులు పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేశారు.

ఈ సందర్భంగా వ్యవస్థాపక అర్చకులు చింతలపాటి సుబ్రహ్మణ్య శాస్త్రి మాట్లాడుతూ శాకాంబరీ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ప్రతి ఒక్కరిపై అమ్మవారి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుందని ఆశీర్వదించారు. అనంతరం ఉత్సవాల నిర్వహణలో భాగస్వాములైన నిర్వాహకులను దేవస్థాన కమిటీ ఘనంగా సత్కరించింది.

మధ్యాహ్నం ఆలయానికి విచ్చేసిన భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించగా, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.