ఆస్ట్రేలియన్లే టార్గెట్‌.. రూ.100 కోట్ల వేట!

  • మాజీ ఎమ్మెల్యే అనుచరుడు ‘పట్టాభి’ అరెస్ట్‌
  • కాల్‌సెంటర్‌ ముసుగులో సైబర్‌ దందా
  • రిట్జ్‌ ఐటీ సొల్యూషన్స్‌ కేంద్రంగా నెట్‌వర్క్‌
  • ఏడెనిమిది నెలలుగా పోలీసులకు చిక్కకుండా పరారీ
  • హైదరాబాద్‌లో అడుగుపెట్టగానే మాదాపూర్‌ సైబర్‌ క్రైం పోలీసుల వల
  • ఇప్పటికే 12 మంది అరెస్ట్‌.. మరింత మందిపై నజర్‌

ఖమ్మం, ఆంధ్రప్రభ : ఖమ్మం జిల్లా కల్లూరు మండలం లింగాల గ్రామానికి చెందిన దేవరపల్లి పట్టాభి సైబర్‌ నేరాల కేసులో పోలీసులకు చిక్కాడు. ఇదే జిల్లాకు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడిగా పట్టాభికి స్థానికంగా గుర్తింపు ఉంది. ఆ పరిచయాల మాటున తనకంటూ ఓ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకున్నాడన్న ఆరోపణలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఆస్ట్రేలియా పౌరులను లక్ష్యంగా చేసుకుని భారీ మొత్తంలో సైబర్‌ మోసాలకు పాల్పడిన కేసులో అతడిని కీలక నిందితుడిగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదైన తర్వాత గడచిన ఏడెనిమిది నెలలుగా పోలీసుల కళ్లుగప్పి విదేశాల్లో తలదాచుకున్నట్లు సమాచారం. చివరకు హైదరాబాద్‌లో అడుగుపెట్టిన పట్టాభి బెంజ్‌ కారులో ప్రయాణిస్తుండగా మాదాపూర్‌ సైబర్‌ క్రైం పోలీసులు వలపన్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కోర్టులో హాజరుపర్చి రిమాండ్‌కు తరలించారు.

‘కాల్‌ సెంటర్‌’ ముసుగులో దందా

హైటెక్‌సిటీ పరిధిలోని మాదాపూర్‌ అయ్యప్ప సొసైటీలో 2024లో రిట్జ్‌ ఐటీ సొల్యూషన్స్‌ పేరుతో కాల్‌సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఖమ్మం, కోల్‌కతా ప్రాంతాలకు చెందిన పలువురిని టెలీకాలర్లుగా నియమించుకున్నట్లు పోలీసులు గుర్తించారు. బయటకు చూస్తే సాధారణ ఐటీ సంస్థలా కనిపించినప్పటికీ లోపల మాత్రం సైబర్‌ మోసాలకు రంగం సిద్ధం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. విదేశీయులను సంప్రదించేందుకు ప్రత్యేకంగా సిబ్బందిని ఉపయోగించినట్లు దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆస్ట్రేలియా పౌరులను టార్గెట్‌గా ఎంచుకుని వివిధ రకాలుగా నమ్మించి డబ్బులు దోచుకున్నట్లు కేసులో అభియోగాలు నమోదయ్యాయి. పట్టాభి తన టీంతో కలిసి ఈ వ్యవహారాన్ని నడిపించినట్లు పోలీసులు పేర్కొంటున్నారు. ఈ నెట్‌వర్క్‌ ద్వారా సుమారు రూ.100 కోట్ల వరకు దోపిడీ జరిగి ఉండొచ్చన్నది పోలీసుల ప్రాథమిక అంచనాగా తెలుస్తోంది.

మోసానికి మాస్టర్‌మైండ్‌ ఎవరు?

ఈ వ్యవహారంలో ఇతని అనుచరులతో పాటు కోల్‌కతా, ఖమ్మం ప్రాంతాలకు చెందిన మరో తొమ్మిది మందిని పోలీసులు నిందితులుగా పేర్కొన్నారు. ఒక్కొక్కరి పాత్రను విడివిడిగా గుర్తించే పనిలో దర్యాప్తు అధికారులు నిమగ్నమయ్యారు. టెలీకాలర్లను ఉపయోగించి విదేశీయులతో సంప్రదింపులు జరిపినట్లు పోలీసులు చెబుతున్నారు. బాధితులను మాటలతో నమ్మించి, వారి నుంచి భారీ మొత్తాలు రాబట్టినట్లు కేసు దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. ఈ నెట్‌వర్క్‌లో ఎవరు ఏ స్థాయిలో పనిచేశారన్నదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పట్టాభి ఈ వ్యవహారానికి కీలకంగా వ్యవహరించినట్లు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే పలువురు అరెస్టు కావడంతో ఈ కేసులో మరిన్ని సంచలన విషయాలు బయటపడే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.

కేసు పెట్టినా.. దేశం దాటినా!

పట్టాభి, అతని టీంపై సైబరాబాద్‌ పోలీసులు గత ఏడాది నవంబర్‌ 28న ఎఫ్‌ఐఆర్‌ 2934/2025 నమోదు చేశారు. ఐటీ చట్టం-2000-2008లోని పలు సెక్షన్లతో పాటు బీఎన్‌ఎస్‌లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదైన తర్వాత పట్టాభి పోలీసులకు చిక్కకుండా కొంతకాలం విదేశాల్లో ఉన్నట్లు సమాచారం. దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు అతడి కదలికలపై నిఘా పెట్టారు. చివరకు హైదరాబాద్‌కు వచ్చిన సమయంలో అతడిని పట్టుకునేందుకు ప్రత్యేకంగా వల పన్నారు. బెంజ్‌ కారులో వెళ్తున్న పట్టాభిని వాహనాన్ని నిలిపి అదుపులోకి తీసుకోవడం ఈ కేసులో కీలక పరిణామంగా మారింది. విదేశాల్లో దాక్కున్నా పోలీసుల నిఘా నుంచి తప్పించుకోలేకపోవడంతో అతడి పరారీకి తెరపడింది.

12 మంది అరెస్ట్‌.. ఇంకా ఎవరెవరు?

పట్టాభి అరెస్టుతో ఈ సైబర్‌ నేరాల వ్యవహారంలో దర్యాప్తు మరో కీలక దశకు చేరింది. ఈ కేసులో ఇప్పటికే పోలీసులు పన్నెండు మందిని అరెస్టు చేసినట్లు సమాచారం. వీరి నుంచి సేకరించిన వివరాల ఆధారంగా నెట్‌వర్క్‌లోని మరికొందరి పాత్రను కూడా పరిశీలిస్తున్నారు. పట్టాభి అరెస్టుతో కాల్‌సెంటర్‌ వ్యవహారానికి సంబంధించిన కీలక ఆధారాలు లభించే అవకాశముందని పోలీసులు భావిస్తున్నారు. విదేశీయులను లక్ష్యంగా చేసుకుని సాగిన ఈ సైబర్‌ దందా వెనుక అసలు సూత్రధారులు ఎవరన్నది తేలాల్సి ఉంది. ఈ నెట్‌వర్క్‌లో ఆర్థిక లావాదేవీలు ఎలా జరిగాయి, డబ్బు ఎక్కడికి చేరింది, ఇంకా ఎంతమంది బాధితులు ఉన్నారన్న కోణంలో దర్యాప్తు సాగుతోంది. బాధితుల సంఖ్య, మోసపోయిన మొత్తంపై పూర్తి స్థాయి దర్యాప్తు అనంతరం మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే ‘సృష్టికర్త’గా బయట ప్రచారం పొందిన పట్టాభి అరెస్టు కావడంతో ఈ సైబర్‌ మోసాల వెనుక దాగిన అసలు కథ వెలుగులోకి వస్తుందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.