మెటా బహిరంగ క్షమాపణ..
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : భారత్‌లో మెటా కార్యకలాపాలపై కేంద్ర ప్రభుత్వం మరింత కఠిన వైఖరి అవలంబించింది. సోషల్ మీడియా వేదికల్లో పిల్లలపై లైంగిక దుర్వినియోగానికి సంబంధించిన కంటెంట్ (CSAM), డీప్‌ఫేక్ కంటెంట్, అలాగే వేదిక నిర్వహణలో జరిగిన లోపాలపై మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ క్షమాపణలు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వంతో జరిగిన కీలక సమావేశంలో మెటా ప్రతినిధులకు భారత చట్టాలను కచ్చితంగా పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. ముఖ్యంగా కంటెంట్‌ను ఎవరికి చూపాలి, ఎవరికి చూపకూడదు అనే నిర్ణయాలను అల్గోరిథమ్‌ల ద్వారా మెటానే తీసుకుంటున్నందున, సంస్థను కేవలం మధ్యవర్తి (Intermediary)గా పరిగణించలేమని ప్రభుత్వం తెలిపింది. ఐటీ చట్టం ప్రకారం మధ్యవర్తి సంస్థలకు లభించే ‘సేఫ్ హార్బర్’ రక్షణ మెటాకు వర్తించదని కేంద్రం స్పష్టం చేసినట్లు సమాచారం. కంటెంట్ ఎంపిక, ప్రాధాన్యత, వ్యాప్తిలో మెటా ప్రత్యక్ష పాత్ర పోషిస్తోందని ప్రభుత్వం అభిప్రాయపడింది.
కీలక అంశాలపై వివరణ…
సమావేశంలో సీఎస్‌ఏఎమ్ కంటెంట్ నియంత్రణ, డీప్‌ఫేక్ వీడియోల నివారణ, ప్రధాని నరేంద్ర మోదీ పోస్టు తొలగింపు ఘటన, అల్గోరిథమ్ పనితీరు, భారత చట్టాలకు అనుగుణంగా వ్యవస్థ అమలు వంటి అంశాలపై మెటా నుంచి వివరణ కోరినట్లు తెలిసింది. భారత్‌లో కార్యకలాపాలు నిర్వహించే ప్రతి సోషల్ మీడియా సంస్థ దేశ చట్టాలను తప్పనిసరిగా పాటించాలని, ప్రజా భద్రత, జాతీయ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
