పండుగ వాతావరణంలో టీడీపీ డోర్-టు-డోర్..
( కృష్ణాలంక, ఆంధ్రప్రభ) : విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని 21వ డివిజన్‌లో బుధవారం నిర్వహించిన టీడీపీ డోర్-టు-డోర్ కార్యక్రమంలో ఎమ్మెల్యే గద్దె రామమోహన్ పాల్గొని ఇంటింటికీ వెళ్లి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డోర్-టు-డోర్ కార్యక్రమం పండుగ వాతావరణంలో సాగుతోందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం దశలవారీగా అమలు చేస్తోందన్నారు.
తల్లికి వందనం పథకం కింద విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.15 వేల చొప్పున జమ చేశామని, స్త్రీశక్తి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామని తెలిపారు. త్వరలో ప్రతి మహిళకు నెలకు రూ.1,500 అందించే పథకాన్ని కూడా అమలు చేస్తామని చెప్పారు. కూటమి ప్రభుత్వంలో ప్రజలు సంతృప్తిగా ఉన్నారని, కేంద్రంతో సమన్వయం కారణంగా రాష్ట్రానికి అధిక నిధులు వస్తున్నాయని గద్దె రామమోహన్ పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
