రైతన్న భూ హక్కులకు రాజముద్ర

  • సమస్యల పరిష్కారానికి రెండు రోజుల గడువు
  • ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు
  • అట్లప్రగడలో రైతులకు పాస్ పుస్తకాల పంపిణీ
  • భూ రికార్డుల్లో పారదర్శకత
  • నకిలీ పత్రాలు, అక్రమాలకు శాశ్వత అడ్డుకట్ట: ఎమ్మెల్యే

ఏ. కొండూరు, ఆంధ్రప్రభ: రైతుల భూ హక్కులకు మరింత భద్రత కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం ఏ.కొండూరు మండలం అట్లప్రగడ గ్రామంలో బుధవారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు రైతులకు నూతన పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ రైతు భూమికి సంపూర్ణ రక్షణ కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. రాజముద్రతో రూపొందించిన ఈ పాస్ పుస్తకాల ద్వారా భూ యాజమాన్యానికి చట్టబద్ధమైన గుర్తింపు లభించడంతో పాటు భూ రికార్డుల్లో పారదర్శకత పెరిగి నకిలీ పత్రాలు, అక్రమ మార్పులు, భూ వివాదాలకు శాశ్వతంగా అడ్డుకట్ట పడుతుందని తెలిపారు. బ్యాంకు రుణాలు, పంట రుణాలు, బీమా, ప్రభుత్వ సబ్సిడీలు తదితర సేవలను రైతులు సులభంగా పొందేందుకు ఇవి ఉపయోగపడతాయని పేర్కొన్నారు.

అనంతరం గ్రామస్తులు మౌలిక వసతులు, రెవెన్యూ, భూ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, అక్కడికక్కడే సంబంధిత శాఖల అధికారులతో ఫోన్‌లో మాట్లాడి తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే సహించబోమని హెచ్చరిస్తూ, ప్రభుత్వ పనుల్లో అలసత్వం ప్రదర్శించే అధికారులపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. గ్రామంలో పెండింగ్‌లో ఉన్న అన్ని సమస్యలను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే, మరో రెండు రోజుల్లో స్వయంగా గ్రామాన్ని మళ్లీ సందర్శించి పనుల పురోగతిని సమీక్షిస్తానన్నారు.

అప్పటికీ సమస్యలు పరిష్కారం కాకపోతే బాధ్యులపై చర్యలు తీసుకునేలా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని హెచ్చరించారు. ప్రజల సమస్యల పరిష్కారమే తన తొలి ప్రాధాన్యమని, తిరువూరు నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో మౌలిక వసతుల అభివృద్ధి, భూ సమస్యల పరిష్కారం, పారదర్శక పాలన కోసం నిరంతరం కృషి చేస్తానని కొలికపూడి శ్రీనివాసరావు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.