కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్‌ను కలిసిన సీఎం

న్యూఢిల్లీ/హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు రాజకీయ, అభివృద్ధి పరంగా ప్రాధాన్యం ఏర్పడింది. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టులకు కేంద్ర అనుమతులు సాధించడం, నిధుల విడుదలతో పాటు కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలపై చర్చించడం లక్ష్యంగా ఆయన బుధవారం వరుస సమావేశాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్‌ను కలిసిన ముఖ్యమంత్రి, తెలంగాణలోని పలు కీలక సాగునీటి, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు అవసరమైన అటవీ, పర్యావరణ అనుమతులను త్వరితగతిన మంజూరు చేయాలని కోరారు. ఈ మేరకు వినతిపత్రాన్ని అందజేశారు.

పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, సీతమ్మసాగర్, ఎస్‌ఆర్‌వీఎస్ డిండి, గౌరవెల్లి ప్రాజెక్టులతో పాటు రాష్ట్ర అభివృద్ధికి కీలకమైన పలు జాతీయ, రాష్ట్ర రహదారి ప్రాజెక్టులకు శాఖాపరమైన అనుమతులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని త్వరగా మంజూరు చేసి తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీలు కూడా పాల్గొన్నారు.

జలశక్తి మంత్రితో కీలక భేటీ

భూపేందర్ యాదవ్‌తో సమావేశం అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌తో సమావేశం కానున్నారు. ఈ భేటీలో గోదావరి–కృష్ణా నదీ జలాల పంపిణీ, ఆంధ్రప్రదేశ్‌తో ఉన్న జల వివాదాలు, కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణ తదితర కీలక అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం.

హైకమాండ్‌తో రాజకీయ చర్చలు

కేంద్ర మంత్రులతో సమావేశాల అనంతరం ముఖ్యమంత్రి కాంగ్రెస్ అధిష్ఠాన నాయకులతోనూ భేటీ కానున్నారు. ఈ సమావేశంలో తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న కేబినెట్ విస్తరణ, పార్టీ వ్యవహారాలు, ప్రభుత్వ రాజకీయ వ్యూహాలపై చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల కర్ణాటకలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణను విజయవంతంగా పూర్తి చేసిన కాంగ్రెస్ అధిష్ఠానం, ఇప్పుడు తెలంగాణ కేబినెట్ విస్తరణపైనా దృష్టి సారించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే, కేబినెట్ విస్తరణపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. హైకమాండ్‌తో జరిగే సమావేశం అనంతరం ఈ అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో ఈ పర్యటనపై ఆసక్తి నెలకొంది.