భర్త హత్య కేసు ఛేదించిన పోలీసులు

  • భార్యే హంతకురాలని తేల్చిన దర్యాప్తు..
  • 24 గంటల్లోనే కేసు చేదింపు

కుంటాల, ఆంధ్రప్రభ : నిర్మల్ జిల్లా కుంటాల మండలం లింబ బి గ్రామంలో అనుమానాస్పద మృతిగా నమోదైన వ్యక్తి కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. భర్తను హత్య చేసినట్లు తేలడంతో భార్యను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. బైంసా ఏఎస్పీ పత్తిపాక సాయికుమార్ బుధవారం విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. లింబ బి గ్రామానికి చెందిన దొంతరే బాలాజీ (36) మంగళవారం అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందాడు. మృతుడి మెడపై గాయాలు ఉండటంతో అతని సోదరి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఫిర్యాదు ఆధారంగా అన్ని కోణాల్లో విచారణ చేపట్టిన పోలీసులు కుటుంబ సభ్యులు, స్థానికులను ప్రశ్నించి ఆధారాలను సేకరించారు. దర్యాప్తులో భార్య పీరాబాయి (పీరా బాయి)తో తరచూ కుటుంబ కలహాలు జరుగుతున్నట్లు గుర్తించారు. ఘర్షణ సమయంలో ఆమె చెక్కతో భర్త గొంతు బిగించి ఊపిరాడకుండా చేయడంతో బాలాజీ అక్కడికక్కడే మృతి చెందినట్లు విచారణలో తేలిందని ఏఎస్పీ వెల్లడించారు.

నేరానికి సంబంధించిన ఆధారాలను సేకరించిన అనంతరం నిందితురాలు పీరాబాయిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. అనుమానాస్పద మృతి కేసును కేవలం 24 గంటల్లోనే ఛేదించిన బైంసా రూరల్ సీఐ ప్రవీణ్ కుమార్, కుంటాల ఎస్సై నరేష్‌తో పాటు దర్యాప్తు బృందాన్ని ఏఎస్పీ అభినందించారు.